Beedi Workers living Earning scheme
-
ఆదుకున్న ‘భృతి’
కోరుట్ల: అసలే అరకొర పనులతో అవస్థలు పడుతున్న బీడీ కార్మికుల ఉపాధికి కరోనా గండికొట్టింది. బీడీలు చేసి కుటుంబాలను పోషించుకోవడం తప్ప ఇతర పనులు చేసుకోలేని కార్మికులకు జీవనభృతి ఆసరాగా నిలిచింది. మినీ సిగరేట్లతో బీడీ కార్మికుల ఉపాధి ఇప్పటికే ప్రశార్థకంగా మారగా..కరోనా లాక్డౌన్ మరింత సమస్యల్లోకి నెట్టింది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. రెండురోజులకోసారి.. గతేడాది సుమారు 9 నెలలపాటు సాగిన కరోనా లాక్డౌన్ ఫలితంగా పూర్తి స్థాయిలో బీడీ కంపెనీలు బంద్ కాగా చాలా మంది కార్మికులు వర్ధి బీడీలు చేసి కంపెనీలు ఇచ్చినంత కూలి తెచ్చుకొని కాలం గడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం మొదట నైట్ కర్ఫ్యూ ప్రక టించింది. మేలో పాజిటివ్ కేసులు మరింత పెరగడంతో 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సమయంలో రెండురోజులకోసారి బీడీ కంపెనీలు కార్మికులకు పనులు కల్పించాయి. నెలకు పదిరోజులకు మించి బీడీ కార్మికులకు పని దొరకలేదు. మే 12 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌తో కంపెనీలు బంద్ చేయడంతో కార్మికులకు పూర్తిగా ఉపాధి కరువై నానాతిప్పలుపడ్డారు. మూడునెలలపాటు.. లాక్డౌన్లో సుమారు 3 నెలలపాటు అరకొర పనులు ఉండడంతో ఇబ్బందులుపడ్డ బీడీ కార్మికులను సర్కార్ అందిస్తున్న జీవన భృతి ఆదుకుంది. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా 84 వేల మందికి పింఛన్ కింద ప్రతీ నెల రూ.2వేల జీవనభృతి అందుతోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీడీ తయారీ కుంటుపడిన కాలంలో కార్మికులు పింఛన్ డబ్బుతో కాలం వెల్లదీశారు. పింఛన్ రాకుంటే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినా బీడీ కంపెనీలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీనెల 26 రోజులపాటు పనులు కల్పించాల్సి ఉంటుంది. బీడీ పింఛనే దిక్కయింది కరోనాతో బీడీ కంపెనీలు రెండునెలలపాటు బంద్ పాటించాయి. రోజు 800 నుంచి వెయ్యి బీడీలు చేసి నెలకు రూ.4 వేల దాకా సంపాదించుకునే మేము రెండునెలలు పనులు లేక తిప్పలు పడ్డాం. అంతో ఇంతో బీడీ పింఛన్ రూ.2వేలు రావడం మాకు ఆసరా అయింది. – పొలాస లక్ష్మి, కోరుట్ల పూర్తి పనులు కల్పించాలి కరోనా లాక్డౌన్ ఎత్తివేసి వారంరోజులు గడుస్తుంది. ఇప్పటికీ బీడీ కంపెనీలు రోజు విడిచి రోజు ఆకు తంబాకు ఇస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేసినట్లే కానీ కంపెనీలు మాత్రం పూర్తిగా పనివ్వడం లేదు. నెలరోజుల్లో కనీసం 20 రోజులైనా పని ఇస్తే బీడీల తయారీపై ఆధారపడిన మాకు కొంత మేలు జరుగుతుంది. – గోనె సరోజ, బీడీ వర్కర్, కోరుట్ల -
మొదటి వారంలో జిల్లాకు సీఎం..!
నిర్మల్, జైపూర్లలో పర్యటన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్చి మొదటి వారంలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం మార్చి 1 నుంచి శ్రీకారం చుట్టాలని భావిస్తున్న బీడీ కార్మికుల జీవన భృతి పథకాన్ని.. మొదటివారంలో జిల్లాలోని నిర్మల్‌లో ప్రారంభించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పలు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన ఖరారు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. జిల్లాలో సుమారు 68 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రతినెలా రూ.వెయ్యి భృతి చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఈ పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైంది. ఎంపీడీవోలు, వీఆర్వోలు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. ఈ పథకాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించాలని రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్‌తోపాటు, నిజామాబాద్ జిల్లాలో కూడా ఒకేరోజు సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి. జైపూర్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన..? సింగరేణి నిర్మిస్తున్న జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడో యూనిట్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సింగరేణి అధికారులు ఇప్పటి నుంచే సీఎం పర్యటన ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బహిరంగ సభా స్థలాన్ని చదును చేస్తున్నారు. ఇక్కడ 600 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా ఇక్కడ మరో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్‌ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 2014 డిసెంబర్ 25న ఈ పవర్ ప్లాంటును కూడా సందర్శించారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు ఉంటాయా? వేర్వేరు రోజుల్లో జిల్లాలో పర్యటిస్తారా.. అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.