
గుడిసెల్లోకి వెళ్లి.. గోడు విని..
మురికివాడల్లో కొనసాగిన సీఎం పర్యటన
హన్మకొండ : నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మురికివాడల సందర్శన రెండో రోజూ కొనసాగింది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హంటర్‌రోడ్డులోని దీన్‌దయాళ్‌నగర్, హన్మకొండ ప్రెస్‌క్లబ్ సమీపం లోని అంబేద్కర్‌నగర్, జితేంద్ర సింగ్ నగర్‌తో పాటు ప్రగతినగర్, నాగేంద్ర నగర్‌లో పర్యటిం చారు. తొలుత దీన్‌దయూళ్ నగర్‌లో ఆయన ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. కాలనీవాసులను నేరుగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా కోడెపాక శంకర్ ఇంట్లోకి ఆయన స్వయంగా వెళ్లారు. ఆ సమయంలో ఇంటి యజమాని శంకర్ అందుబాటులో లేకపోగా అతడి భార్య విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంట్లో ఉన్న కూతురు స్రవంతి తన కుటుంబ సమస్యలు సీఎం కేసీఆర్‌కు వివరించారు.
తాము కష్టాల్లో ఉన్నామని, పక్కా ఇల్లు లేదని, ముగ్గురం ఆడ పిల్లలమని చెప్పింది. స్రవంతి చెప్పిన మాటలు సీఎం శ్రద్ధగా విన్నారు. అనంతరం వీధిలో నడుస్తూ కాలనీకి చెందిన బొంత వెంకన్నను సీఎం కేసీఆర్ పలకరించారు. తాము 25 ఏళ్లుగా ఈ కాలనీలో నివాసముంటున్నామని, పట్టాలు లేవని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వివరించారు. కాలనీకి చెందిన పోత్రం బిక్షపతి తనకు లివర్ పాడైందని, వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేదని, తనకు వైద్యం చేయించాలని కోరారు. కాలనీలో తిరుగుతుండగా మురుగు కాల్వ సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే మురుగు కాల్వను పరిశీలించారు. అనంతరం కాలనీలోని ఇల్లందుల ఆయిలమ్మ, సాయిలు కుటుంబం నివసిస్తున్న గుడిసెను పరిశీలించారు. సీఎం గుడిసెను పరిశీలించిన సమయంలో అందులో కుటుంబం అందుబాటులో లేదు. ఈ సమస్యలు విన్న సీఎం కేసీఆర్ అనంతరం జరిగిన సమావేశంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తానన్నారు.
ఇదే కాలనీకి చెందిన ఎ.మోహన్‌రావు, భాగ్యలక్ష్మి దంపతులు తాము పడుతున్న కష్టాలు వివరించారు. తాను వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసేవాడినని, తనకు జీతం పెంచాలని కోరినందుకు తొలగించారని మోహన్‌రావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన శనివారం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వచ్చి తనను కలవమని సూచించారు.