
మాటలు బంద్.. ఇక పనులు చేద్దాం
* సమస్యల పరిష్కారానికి రాజకీయాలకతీతంగా పనిచేద్దాం..
* అందుకు ఇదే తొలి అడుగు కావాలి
* ‘స్వచ్ఛ హైదరాబాద్’ సమీక్షలో ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘నాలా నీళ్లలోనే నిర్మాణాలు.. అధ్వానంగా పారిశుద్ధ్యం.. మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు.. ఇళ్ల పైనుంచే హైటెన్షన్ వైర్లు.. ఇలా సమస్యలతో నగరం అల్లాడుతోంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే బాగుచే ద్దామన్నా చేసుకోలేని దుస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తపడాలి. ఇక మాటలు బంద్.. పనులు జరగాలి. ఎంత డబ్బు అవసరమైనా ఇస్తాం. రాజకీయాలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పనులు పర్యవేక్షించాలి. అందరం నగర సమస్యల పరిష్కారం కోసం కలసి పనిచేద్దాం. అందుకు ఇదే తొలి అడుగు కావాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.
ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగిన ‘స్వచ్ఛ హైదరాబాద్’లో వచ్చిన ప్రజాసమస్యలు, తదితరమైన వాటిపై గ్రేటర్‌లోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో సీఎం మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్ డీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పారు. గ్రేటర్‌లో పారిశుధ్యం పరిస్థితి బాగాలేదని, రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోందని, దీన్ని బయటకుపంపించేందుకు, నిర్వహించేందుకు సరైన ఏర్పాట్లు లేవని, అందరం కలసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. నగరానికి నాలుగువైపులా 50 కిలోమీటర్ల అవతల డంప్‌యార్డులు ఏర్పాటు చేద్దామన్నారు. ఢిల్లీ, నాగపూర్‌లో ఘనవ్యర్థాల నిర్వహణకు అవలంభిస్తున్న పద్ధతుల్ని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాలని నిర్ణయించారు.
మంచిగా తీర్చిదిద్దుకుందాం..
మన హైదరాబాద్ నగరాన్ని మనమే మంచిగా తీర్చిదిద్దుకుందామని సీఎం కేసీఆర్ సూచించారు. బస్తీల్లోని హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగిస్తామని, పాతబస్తీలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి మూడు కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 390 కిలోమీటర్ల పొడవున 72 నాలాల పరిస్థితి బాగులేదని, నాలాలపైనే కాక నాలా నీళ్లలో సైతం కట్టడాలు వెలిశాయని, వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నాలాలు, హైటెన్షన్ వైర్ల దుస్థితి, చెత్త తరలింపు, శిథిలాల తొలగింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధుల నుంచి కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని, జూపల్లి, తలసాని, పద్మారావుగౌడ్‌తో పాటు గ్రేటర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వాలి: సీఎం
గ్రేటర్ పరిధిలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించాలని, మురుగునీటి పారుదల వ్యవస్థ వంద శాతం మెరుగుపడాలని, కలుషిత జలాల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నగరంలో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలపై విపక్ష ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు. నగరానికి నిత్యం 602 మిలియన్ గ్యాలన్ల జలాలు అవసరం ఉండగా.. ప్రస్తుతం 385 ఎంజీడీల జలాలే సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు సీఎంకు తెలిపారు.
నగరంలో 20 లక్షల ఇళ్లుంటే 14 లక్షల కుటుంబాలకే నల్లాల ద్వారా మంచినీరు అందుతోందని వివరించారు. శివారు కాలనీలు, బస్తీలకు మంచినీరు అందించేందుకు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నీటి పథకాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నాలాలపై ఆక్రమణల నిరోధం, మురుగునీటితో నిండిన నాలాల గుర్తింపు, స్థానికుల అవస్థలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలిపై ఏర్పాటు చేసే సబ్‌కమిటీలు జూన్ 8లోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలకు కమిటీలు వేసే బాధ్యతను అప్పగించారు.