కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలకు వాయినం సమర్పిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు
సాక్షి, సిద్దిపేట : కరువు నేలను గోదారమ్మ ముద్దాడింది. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి ఎగిరి దుంకింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గోదావరి ఉత్తుంగ జలవాహినిలా కొండపోచమ్మ రిజ ర్వాయర్‌లోకి ప్రవహించింది. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు, నవధాన్యాలు, పూలు, పండ్లను నీటి ప్రవాహంలో వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారూక్ హుస్సేన్, బి. వెంకటేశ్వర్లు, శేరి శుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సతీష్‌కుమార్, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండపోచమ్మ ఆలయంలో తీర్థం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు
పూజలతో కార్యక్రమానికి శ్రీకారం...
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు చండీయాగం చేపట్టగా కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వరదరాజుపూర్‌లోని వరదరాజుల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
చినజీయర్ స్వామితో కలిసి..
ఏ కార్యక్రమం చేపట్టినా యజ్ఞ, యాగాలు నిర్వహించే ఆనవాయితీ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు కూడా మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చినజీయర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారందరికీ చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా పంప్‌హౌస్ వద్దకు చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ వెళ్లి పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి కొండపొచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జాలలను వదిలారు.
శుక్రవారం కొండపోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన చండీయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు
సతాయించిన రెండో మోటార్
మర్కూక్, జగదేవ్‌పూర్ (గజ్వేల్): కొండపోచమ్మసాగర్ పంప్‌హౌస్ ప్రారంభంలో రెండో మోటార్ కొంతసేపు సతాయించింది. పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను ప్రారంభించేందుకు మర్కూక్ కట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకొని మోటార్లను స్విచ్ ఆన్ చేయగా మొదటి మోటార్ వెంటనే ప్రారంభమైంది. కానీ సాంకేతిక కారణాలతో రెండో మోటార్ ఆన్ కాలేదు. దాన్ని రిపేర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో కేసీఆర్, మంత్రులు అక్కడి నుంచి వరదరాజుపూర్‌లోని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్లారు. అరగంట తర్వాత మోటార్‌ను బాగు చేశాక సీఎం కేసీఆర్ తిరిగి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని రెండో మోటార్‌ను ప్రారంభించారు.
మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్‌స్వామి తదితరులు
సుదర్శనయాగంలో
నవ దంపతులు
మర్కూక్ (గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగంలో పాల్గొనే అదృష్టం మర్కూక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ నూత న దంపతులకు లభించింది. పాండుగౌడ్‌కు ఈ నెల 27న మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన మేఘనతో వివా హం జరగ్గా పెళ్ల యిన రెండో రో జే అంటే శుక్రవా రం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సుదర్శనయాగంలో నూ తన దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో కలసి ఈ అరుదైన ఘట్టంలో పాలుపంచుకున్నారు. అలాగే త్రి దండి చినజీయర్‌స్వామి నుంచి ఆశీర్వాదాలు తీసుకు న్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాండు గౌడ్ దంపతులను మా ఎంపీపీ దంపతులు అంటూ పరిచయం చేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో తమకు అవకాశం దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment