రైతులతో త్వరలో సీఎం కేసీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ లక్ష్యాలు, ఉద్దేశాలను రైతులకు వివరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. త్వరలో జిల్లాకు వంద మంది రైతుల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులతో సీఎం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఆ శాఖ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లా నుంచి ఆదర్శవంతమైన, వివాదరహితులైన రైతులను గుర్తించి, రెండు రోజుల్లో ఆ వివరాలను కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించారు. సమగ్ర సర్వే 85 శాతం పూర్తయిందని, ఇంకెక్కడైనా రైతులుంటే వారినీ నమోదు చేయాలన్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లాల సమగ్ర సర్వే నివేదికలు తమకు పంపాలని పేర్కొన్నారు.