అది పక్కా రాజకీయ కుట్ర: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతుల ఆందోళన, విధ్వంసం ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఖమ్మం మార్కెట్ యార్డులో అలర్లు, విధ్వంసం రాజకీయ కుట్రతో, ప్రథకం ప్రకారమే జరిగాయని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఖమ్మం మిర్చి యార్డులో జరిగింది కృత్రిమ ఆందోళన అని, రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిని చేశారని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఈ వివరాలను స్వయంగా తానే బయటపెడతానని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ విధ్వంసానికి కారణమైనవారిపై అంతేస్థాయిలో కేసులు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
భూసేకరణ బిల్లులోని సవరణలను అసెంబ్లీ ఆమోదించే విషయమై బీఏసీ సమావేశం శనివారం వాడివేడిగా జరిగింది. భూసేకరణ బిల్లు ప్రధానమని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. భూసేకరణ బిల్లులోని సవరణల ఆమోదం కోసం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా భూసేకరణ బిల్లు చర్చించే అవకాశముందని, ఇతర అంశాలు సభముందుకు రాకపోవచ్చునని తెలుస్తోంది.