బీఏసీకి హరీశ్‌ రాకపై అభ్యంతరం | MLA Harish Rao Boycott BAC Meeting: Telangana | Sakshi
Sakshi News home page

బీఏసీకి హరీశ్‌ రాకపై అభ్యంతరం

Published Fri, Feb 9 2024 1:36 AM | Last Updated on Fri, Feb 9 2024 1:52 AM

MLA Harish Rao Boycott BAC Meeting: Telangana - Sakshi

గురువారం బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, భట్టి, శ్రీధర్‌ బాబు,పొన్నం, అక్బరుద్దీన్‌ ఒవైసీ, కడియం శ్రీహరి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు కోసం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో మంత్రులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య స్వల్ప వాగ్విదం జరిగింది. బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌కు బదులు హరీశ్‌రావు బీఏసీ భేటీకి హాజరు కావడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ చాంబర్‌లో బీఏసీ తొలి సమావేశం ప్రారంభమైంది.

అధికార పార్టీ తరఫున శ్రీధర్‌బాబు, పొన్నంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున హరీశ్‌రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున తనకు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశంలో పాల్గొంటారంటూ మాజీ సీఎం కేసీఆర్‌ బుధవారం స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే శ్రీధర్‌బాబు, పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది. కేసీఆర్‌కు బదులుగా తాను హాజరయ్యేందుకు స్పీకర్‌ అంగీకరించారని హరీశ్‌ చెప్పారు. అయితే ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి హరీశ్‌రావు హాజరయ్యేందుకు వీలు లేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.  

అలా హాజరయ్యేందుకు వీలు లేదు: శ్రీధర్‌బాబు 
తాము ఎవరిని బీఏసీ సమావేశం నుంచి బయటకు వెళ్ళమని చెప్పలేదని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ నిర్ణయం మేరకు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కలి్పంచారని చెప్పారు. దీంతో బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్లు ఇచ్చారని తెలిపారు. కానీ బీఏసీ భేటీకి కేసీఆర్‌ రావడం లేదు కాబట్టి తాను వస్తానని హరీశ్‌రావు తెలిపారని, అయితే ఒక సభ్యుడు సమావేశానికి రావడం లేదని చెప్పి అతడి స్థానంలో మరో సభ్యుడికి అనుమతినివ్వడం కుదరదని పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి లేఖ కూడా ఇవ్వలేదని తెలిపారు. కాగా అసెంబ్లీని ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు తా ము సిద్ధమని శ్రీధర్‌బాబు చెప్పారు. దీనిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

గతంలో అనేకసార్లు మేం అనుమతించాం: హరీశ్‌
గతంలో తాము బీఏసీ జాబితాలో లేని వారిని కూడా పార్టీ శాసనసభా పక్ష నేత వినతి మేరకు అనుమతించిన విషయాన్ని హరీశ్‌ గుర్తు చేశా రు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ బదు లుగా ఎమ్మెల్యే బలాలను పలు సందర్భాల్లో అనుమతించామని, అవసరమైతే బీఏసీ మిని ట్స్‌ను పరిశీలించాలని అన్నారు. తాము అలా అనుమతించలేదని నిరూపిస్తే రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తానని హరీశ్‌ స్పష్టం చేశారు. దీంతో మినిట్స్‌ పరిశీలించేందు కు సమయం పడుతుందని, అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో సర్దుకుపోవాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కోరారు. దీంతో మీ విచక్షణకే వదిలివేస్తున్నానంటూ హరీశ్‌రావు బీఏసీ భేటీ నుంచి బయటకు వచ్చారు. దీంతో కడియం ఒక్కరే బీఆర్‌ఎస్‌ తరఫున బీఏసీ భేటీలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement