తిరిగొచ్చిన సీఎం.. సమీక్షలతో బిజీబిజీ
నాలుగురోజుల వరంగల్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే ఆయన పలు అంశాలపై సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముందుగా సమీక్షించారు. పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోడానికి ఓ కమిటీ ఏర్పాటుచేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది.
మరోవైపు హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంబై నగరంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి ఇక్కడ ఏర్పాటుచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఒకేచోట భవనాల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్షించారు. రాజధానిలో సీఎం, సీఎస్, డీజీపీల నివాస ప్రాంగణాలు ఒకేచోట ఏర్పాటుచేయడంపై చర్చించారు. ఇంకోవైపు.. తెలంగాణలో గుడుంబా నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మూడు రోజుల్లో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.