సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్ లో శనివారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు శాంత కుమారి, నర్సింగ్ రావు, రామకృష్ణా రావు, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
లాక్‌డౌన్ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోందని.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ బయటకు రానీయొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో నిర్వహణ మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించాలని తెలిపారు. ఎంత మందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ పనులు యథావిధిగా జరిగేవిధంగా చూడాలని.. కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment