మీడియాతో మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద. చిత్రంలో ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నేను సీఎంనే. సీఎం అంటే కామన్ మ్యాన్ ఆఫ్ ది స్టేట్’అని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పరిపూర్ణానంద విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎంఐఎంతో కలసి పనిచేస్తున్న టీఆర్‌ఎస్ కూటమి ఒకటైతే, టీడీపీతో కలసిన కాంగ్రెస్ కూటమి రెండోవైపు ఎన్నికల్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీసస్ పాలన తెస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని పరిపూర్ణానంద ఆరోపించారు. హిందుస్తాన్‌లో హిందువులకు స్థానం, రక్షణ లేకుండా పోయిందని, వరంగల్‌లోని ఒక ఆలయంలో పూజలో ఉన్న పూజారిని పట్టపగలే చంపేసినా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ రెండు కూటములు పట్టించుకోలేదని పరిపూర్ణానంద ఆరోపించారు. పూజారిని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
హిందువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దారుస్సలేం ఆజ్ఞల ప్రకారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంతకాలం నడిచిందని ఆరోపించిన పరిపూర్ణానంద... లాల్‌దర్వాజ ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం ద్వారా బీసీల పొట్టకొడతారా? అని ప్రశ్నించారు. హిందువులను కాపాడుకోవడానికే తాను బీజేపీలో చేరానన్నారు. తనపై నిఘా కోసం ప్రభుత్వం 500 మంది పోలీసులు, 30 పెట్రోలింగ్ వాహనాలను పెట్టిందని, తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదనే అనుమానం ఉందని పరిపూర్ణానంద పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు.
మోదీకి భయపడే కేసీఆర్ ‘ముందస్తు’కు...: ఇంద్రసేనారెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారన్నారు. ఎల్లో ట్రావెల్స్ అధినేత శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో శనివారం చేరారు. ఈ సందర్బంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎన్నికల హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సర్వేలన్నీ మోదీకి అనుకూలంగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment