సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల నిర్వహణలో మాస్ కాపియింగ్‌కు రంగం సిద్ధం చేయడంపై ‘అంతా ఓపెన్’ అనే పతాక శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఓపెన్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సీరియస్ అయినట్లు సమాచారం. చీఫ్ సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లను మార్చాలని, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్లకు పరీక్షల విధులు ఎలా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం వెంటనే సిట్టింగ్ స్క్వాడ్స్‌తో అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయించారు. ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
మమ అనిపించారు..
నిజామాబాద్‌లోని ఖిల్లా పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్లు తెలిసింది. గేటు వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతోనే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రంలోకి ఇతర వ్యక్తులను అనుమతించని అధికారులు ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాశారంటే ఈ పరీక్షల నిర్వహణ తీరును అద్దం పడుతోంది. మొదటిరోజు తెలుగు పరీక్షకు తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులనే ఎగ్జామినేషన్ డ్యూటీ వేయడం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. సిట్టింగ్ స్క్వాడ్ సైతం పరీక్ష కేంద్రాలకు చివరి నిమిషంలో అలా వచ్చి.. ఇలా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇన్విజిలేటర్ తొలగింపు..?
నగరంలోని దుబ్బ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించినట్లు తెలిసింది. కాగా మొదటిరోజు దుబ్బ పరీక్ష కేంద్రం వద్ద ఓ అభ్యర్థి గొడవకు దిగారు. గతంలో డబ్బులిచ్చినా పాస్ చేయించలేదని, ఈ సారైనా పాస్ చేస్తారా.. లేదా అని ఇన్విజిలేటర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ పంచాయితీ కాస్త కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆయన సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ఆయనను ఇన్విజిలేటర్‌గా తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. అదేవిధంగా డబ్బులు వసూలు చేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న సీఎస్‌లను కూడా మార్చాలని ఆదేశించినట్లు తెలిసింది. స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్లకు ఎగ్జామినేషన్ విధులు కేటాయించడమే నిబంధనలకు విరుద్ధం. అందులోనా డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలను బేఖాతర్ చేసి విధులు కేటాయించి అవకతవకలకు తెరలేపడం విద్యాశాఖలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని రచ్చకీడ్చింది.
మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు
జిల్లాలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో మొదటిరోజే మాల్‌ప్రాక్టిక్ కేసు నమోదైంది. ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ అభ్యర్థి నకల్ చీటిలతో పరీక్ష రాస్తుండగా సిట్టింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. కాగా మొదటిరోజు ఓపెన్ ఇంటర్ 3 పరీక్ష కేంద్రాల్లో 965 అభ్యర్థులకుగాను 876 మంది హాజరుకాగా 91 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ ఎస్సెస్సీ 8 కేంద్రాల్లో 1219 మందికిగాను 1127 అభ్యర్థులు హాజరు కాగా, 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
సెలవుపైవెళ్లిన డీఈఓ
జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ సెలవుపై వెళ్లారు. మంగళవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు వ్యక్తిగత సెలవు పెట్టినట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ఇన్‌చార్జి డీఈఓగా అసిస్టెంట్ డైరెక్టర్ లాయక్‌అలీఖాన్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment