కాళేశ్వరం కదా.. కలెక్టర్లు ఫిదా! | Collectors of all districts who visited the Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం కదా.. కలెక్టర్లు ఫిదా!

Published Thu, Aug 29 2019 3:29 AM | Last Updated on Thu, Aug 29 2019 4:50 AM

Collectors of all districts who visited the Kaleshwaram Project - Sakshi

మేడిగడ్డ బ్యారేజీ వద్ద మ్యాప్‌ ద్వారా వివరాలు తెలుపుతున్న ఇంజనీర్‌ అధికారి

సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అద్భుతమని, అతి తక్కువ సమయంలో నిర్మించిన ప్రాజెక్టు తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్మాణ స్ఫూర్తితో జిల్లాల్లో సంక్షేమాభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని వారు తెలిపారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ఇంజనీరింగ్‌ అద్భుతమని వార్తాపత్రికల్లో చదవడమే తప్పితే నేరుగా చూసింది లేదని, ఇన్నాళ్లకు తమ కోరిక తీరిందని అన్ని జిల్లాల కలెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ (మేడిగడ్డ)బ్యారేజ్, లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌లను సందర్శించారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ కలెక్టర్లందరూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించి రావాలని సూచించారు. పర్యటనలో భాగంగా మంగళవారం హన్మకొండలో విడిది చేసిన కలెక్టర్లు బుధవారం ప్రత్యేక బస్సులో జిల్లాకు చేరుకున్నారు. 

కాళేశ్వరం రాచబాట 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సీఎం కేసీఆర్‌ కల అని, బంగారు తెలంగాణ ఏర్పాటుకు కాళేశ్వరం రాచబాట అని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి నేరుగా హైదరాబాద్‌ నుంచే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనితీరును సమీక్షిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రాజెక్టు వివరాలను ఇంజనీరింగ్‌ అధికారులు కలెక్టర్లందరికీ వివరించారు. కేవలం 29 నెలల్లోనే ప్రాజెక్టు నిర్మించిన తీరును చూసి కలెక్టర్లందరూ ప్రేరణ పొందుతున్నారని సోమేశ్‌కుమార్‌   అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ప్రాజెక్టు ప్రారంభిస్తున్నప్పుడు ఇది అవుతుందా అని అనేకమంది సందేహాలు లేవనెత్తారని అలాంటిది సీఎం కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సోమేశ్‌ కుమార్‌ వివరించారు.  

బ్యారేజ్, పంప్‌హౌస్‌ల సందర్శన 
ప్రాజెక్ట్‌పై ఇంజనీరింగ్‌ అధికారులు నిర్వహించిన సమావేశం అనంతరం కలెక్టరందరూ మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. మందుగా మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన కలెక్టర్లకు ఇంజనీర్లు నిర్మాణం, నీటి ప్రవాహం, గేట్ల పనితీరును వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన కలెక్టర్లు మోటార్ల పనితీరును, నీటి లభ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌ నుంచి నీటిని గ్రావిటీ కెనాల్‌లోకి వదిలే డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించారు.  

కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజలు.. 
మేడిగడ్డ నుంచి కాళేశ్వరం చేరుకున్న పాలనాధికారులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement