ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుండే కమ్యూనిస్టుపార్టీలకు జిల్లాలో మంచి పట్టుండేది. చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకర్తలతో పాటు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఎర్రజెండా ఎగరలేదు. చాలా చోట్ల పోటీ చేసినా ఎక్కడా విజయం సాధించలేదు. పార్టీలు, నేతల మధ్య సిద్ధాంత విభేదాలు, ఆధిపత్య పోరే అందుక కారణం.
సాక్షి, బోధన్: జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలకు ఘనమైన చరిత్రే ఉంది. దశాబ్దాల క్రితం నుంచి పార్టీ నిర్మాణం చేపట్టి, ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పార్టీ అనుబంధ సంఘాల నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కార్మికులను సంఘటితం చేసి, వారి సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాయి. విద్యార్థి, యువత, మహిళా, అసంఘటిత రంగ కార్మికులు, రైతాంగ సమస్యలపై నిరంతరం గళమెత్తుతూనే ఉన్నాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు తలోదారిలో వెళ్తుండడంతో కామ్రేడ్లు అధికారం దక్కించుకోలేక పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేసినా ఎర్రజెండా పార్టీల అభ్యర్థులు ఓటమి మూటగట్టుకుంటున్నారు. సిద్ధాంత విభేదాలు, రాజకీయ ఎత్తుగడ తదితర అంశాల్లో కమ్యూనిస్టు పార్టీల్లో విభేదాలు చోటు చేసుకుని ఎన్నికల్లో తలోదారిలో నడుస్తున్నాయి. బోధన్, రూరల్ వంటి నియోజక వర్గంలో క్రియాశీలకంగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం దక్కలేదు. దశాబ్దాలు గడిచినా అధికార పీఠం దక్కలేదు.
సమరశీల పోరాటాల ఘన చరిత్ర
బోధన్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం), ఆర్‌ఎస్పీ, ఎంసీపీఐ (యూ) పార్టీలు నిరంతరం కార్మికులు, పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాయి. గతంలో జిల్లాలో జరిగిన చారిత్రాత్మక పోరాటాల్లో నియోజక వర్గానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు కీలక పాత్ర వహించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణకు ఎగువ భాగంలో నిర్మించిన సింగూర్ ప్రాజెక్టును ఇందూరు జిల్లాకే కేటాయించాలని నిజాంసాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 1986, 1997లలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలే నేతృత్వం వహించాయి. దశాబ్దాల నుంచి ఇప్పటివరకూ బీడీ కార్మికుల పోరాటాలకు ప్రాతిని«ధ్యం వహిస్తున్నాయి. 2000 సంవత్సరంలో కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా, 2002లో చంద్రబాబు హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా పోరాటం చేశాయి.
ఫ్యాక్టరీ భూములు పేదలకు పంచాలని జరిగిన భూపోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు ఏకతాటిపై నిలిచి ఉద్యమించాయి. మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలు సమరశీల పోరాటాలు చేపట్టాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడుపాలని, ప్రైవేట్ కంపెనీ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలని కమ్యూనిస్టులు ఇతర రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఏకతాటిపై నిలిచే కమ్యూనిస్టులు.. ఎన్నికల వేళ మాత్రం తలోదారిలో వెళ్తుండడంతో అధికారానికి దూరమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయా కమ్యూనిస్టు పార్టీలలో అంతర్గతంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు, విభేదాల కారణంగా కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావడం లేదని, అందువల్లే దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై పని చేస్తున్ననా కమ్యూనిస్టులకు అధికారం దక్కడం లేదని విశ్లేషిస్తున్నారు.
ప్రతి సారీ ఓటమే..
1952లో బోధన్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం ఇక్కడ విజయం సాధించారు. సీపీఐ, సీపీఎం ఎన్నికల వేళ చెరో కూటమిలో చేరి విడిపోతున్నారు. విప్లవ పార్టీ అయిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ 1989లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఆ పార్టీ డివిజన్ ప్రతినిధి చిక్కెల లక్ష్మణ్ పోటీ చేసి ఓడిపోయారు. 1994లో న్యూడెమోక్రసీ అభ్యర్థిగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా మాజీ కార్యదర్శి సుధారాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2009లో ఎంసీపీఐ అభ్యర్థిగా కోటగిరి మండలానికి చెందిన యార్లగడ్డ సాయిబాబా కూడా పెద్దగా పోటీ ఇవ్వలేక పోయారు. 2014 ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ అభ్యర్థిగా యార్లగడ్డ సాయిబాబా పోటీ చేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉండగా, సీపీఎం నేతృత్వంలో ప్రజా సంఘాలతో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తుండగా, సీపీఐ పోటీకి దూరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment