సత్తుపల్లి, న్యూస్‌లైన్ : ‘మే నెలాఖరుకు బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ పనులు పూర్తి చేస్తాం.. వచ్చే ఖరీఫ్ నాటికి వేంసూరు మండలానికి సాగునీరు అందిస్తాం..’ అని ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని.. భూసేకరణకు అడ్డంకులు తొలగించటంలో రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పాత ఎన్టీఆర్ కాలువ సింగరేణి ఓపెన్‌కాస్టు విస్తరణలోకలిసిపోతున్నందున.. వేంసూరు మండలానికి సాగునీరు అందించే లక్ష్యంతో బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ పనులు చేపట్టారు. ఈ కాలువ ద్వారా మండలంలోని 41 చెరువులను నింపి, 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2007 నవంబర్‌లో ప్రారంభించిన పనులు 2009లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో కాల్వ డిజైన్ మార్చి మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం లభించడానికి రెండేళ్లకు పైగా పట్టింది.
అసైన్డ్ భూమలకు పరిహారం ఇవ్వకపోవటంతో...
అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వటంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భూనిర్వాసితులు పనులను అడ్డుకుంటున్నారు. సత్తుపల్లి మండలం రేజర్లలో మూడు ఎకరాలు, వేంసూరు మండలం లింగపాలెంలో మూడు ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ‘సర్వేలు చేశాం.. రిపోర్టులు సమర్పిస్తున్నాం’ అని చెపుతున్నారే తప్ప తమకు మాత్రం పరిహారం అందడం లేదని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రెండేళ్లు గడుస్తున్నా అధికారుల సమన్వయ లోపంతో మట్టి కాలువ నిర్మాణ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. కాగా, కాల్వ నిర్మాణ పనుల కోసం 103 ఎకరాల పట్టాభూమిని కూడా సేకరించి, సంబంధిత రైతులకు రూ.6 కోట్లు పరిహారం చెల్లించారు. అయితే స్ట్రక్చర్ల నిర్మాణానికి 50 మీటర్ల భూమి అవసరం కాగా, తొలుత 40 మీటర్లు మాత్రమే సేకరించి పరిహారం అందించారు. ఆ తర్వాత మిగితా 10 మీటర్ల మేర కూడా భూమి తీసుకున్నప్పటికీ.. సంబంధిత రైతులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం చేశారు. చివరకు ఆయా రైతులు పనులపై అభ్యంతరం వ్యక్తం చేయడం, నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఎట్టకేలకు గత ఏడాది ఎకరాకు రూ.5.50 లక్షల చొప్పున ధర నిర్ణయించి వారికి రావాల్సిన మొత్తాన్ని అందజేశారు. ఇది కూడా పనుల జాప్యానికి ఓ కారణమైంది. ఇక అసైన్డ్ రైతులకు నేటికీ పరిహారం ఇవ్వకపోవడంతో వారు కూడా పనులు అడ్డుకుంటున్నారు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఇలా అధికారుల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్రిడ్జి పనులకు ఆటంకం...
సత్తుపల్లి పట్టణ శివారులో బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇసుక కొరతతో మూడు నెలలకుపైగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే రవాణాకు క్లియరెన్స్ రావటంతో ఇసుక తోలుతున్నారు. బేతుపల్లి చెరువు నుంచి వేశ్యకాంతల చెరువుల వరకు 3.5 కిలోమీటర్లు కెనాల్ బ్యాంకింగ్ (బండ్ కాలువ) పనులు కూడా చేపడుతున్నారు. బండ్(మట్టితో కట్ట) కాలువకు ఇరువైపులా 50 మీటర్ల వెడల్పు, 9 అడుగుల ఎత్తులో కాలువ 12 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణం చేపట్టి రాయితో రివిటింగ్ పనులు చేస్తున్నారు. ఇవి 90 శాతం మేర పూర్తి కావచ్చాయి.
ఖరీఫ్‌కైనా నీరందేనా..?
Published Thu, May 15 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement