ఆమరణ నిరాహార దీక్షకూ వెనుకాడం
ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల హెచ్చరిక
కేసీఆర్ స్ఫూర్తితోనే సమ్మె చేస్తున్నామని వ్యాఖ్య
జీవో 107ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనుకాడబోమని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో ‘నీవే మాకు స్ఫూర్తి’ అంటూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలోనూ విధులు బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, సుల్తాన్ బజార్, పేట్లబురుజు, ఈఎన్‌టీ, సరోజినీదేవీ కంటి ఆస్పత్రులకు చెందిన సుమారు 1,700 మంది జూనియర్ వైద్యులు గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. జూడాలంతా సమ్మెలోకి వెళ్లడంతో ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, స్వప్నిక, రాఘవేంధ్ర , అనిల్, రామ్‌చందర్, రమేశ్‌లు మాట్లాడుతూ తమ విజ్ఞప్తులకు ప్రభుత్వం స్పందించక పోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. జూడాలు ధర్నాకు దిగితే అండగా ఉంటానని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆయన స్ఫూర్తితోనే సమ్మె కొనసాగిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేయకుంటే తమకు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని, ఇది ఎంసీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. వైద్యశాఖ మంత్రి చర్చల పేరుతో తమను సచివాలయానికి పిలిచి అవమానించడమే కాకుండా సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.