పీఆర్సీకి ‘అసమగ్ర’ మార్గదర్శకాలు
జారీ చేసిన ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్ ద్వారాన కొత్త జీతాలు
పెన్షనర్లకు తప్పని ఎదురు చూపులు
హైదరాబాద్: పదో పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, జారీ చేసిన మార్గదర్శకాలు (సర్క్యులర్ మెమో నం. 3856) అసమగ్రంగా ఉన్నాయి. సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్) ద్వారానే కొత్త జీతాలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఆర్థిక లబ్ధి అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి వరకు.. 10 నెలల వేతన బకాయిలను ఎప్పుడు, ఎలా చెల్లించాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. బకాయిల చెల్లింపునకు వేరుగా ఉత్తర్వులు ఇస్తారని మాత్రమే పేర్కొన్నారు.
మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు
నోషనల్‌గా (పెంపు కాగితాలకే పరిమితం) పీఆర్సీ అమలు చేస్తున్న 2013 జూలై 1 నాటికి ఉన్న మొత్తం జీతం, మూల వేతనం, అప్పటి నుంచి 2015 మే 31 వరకు వచ్చిన పదోన్నతులు, బదిలీలు, నియామకాలు (ఎంఈవోలుగా నియమితులైన స్కూలు అసిస్టెంట్లు తదితర) వివరాలను ఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి.
అనధికారికంగా గైర్హాజరు, తీసుకున్న సెలవుల డేటా నమోదు చేయాలి. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులుంటే.. ఆ వివరాలు ఇవ్వాలి. ఇంక్రిమెంట్లు రద్దు లాంటి క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగుల వివరాలూ నమోదు చేయాలి.
సీఎఫ్‌ఎంస్‌లో అన్ని వివరాలు నమోదు చేస్తే, తాజా స్కేళ్ల ప్రకారం కొత్త జీతభత్యాల వివరాలను సీఎఫ్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంది. వాటిని ఆయా శాఖాధిపతులు ట్రెజరీలకు సమర్పించాలి.
ఈ వివరాలేవి?
పదోన్నతులు లభించని ఉద్యోగులకు యాంత్రిక పదోన్నతి విధానం ద్వారా సర్వీసులో 6, 12, 18, 24 ఏళ్లకు పదోన్నతి మేర లభించే స్కేళ్లను అమలు చేస్తారు. కొత్త పీఆర్సీలో యాంత్రిక పదోన్నతి విధానాన్ని యథావిధిగా అమలు చేయాలని సిఫారసు చేసింది. ఈ విధానం ద్వారా కొత్త స్కేళ్ల అమలు విషయాన్ని మార్గదర్శకాల్లో ప్రస్తావించలేదు. యాంత్రిక పదోన్నతి పొందే ఉద్యోగుల కొత్త స్కేళ్లను నిర్ధారించడం శాఖాధిపతులు, ట్రెజరీలకు సాధ్యం కాదు.
ఏ క్యాడర్‌లో అయినా ఉన్నత శ్రేణి జీతం అందుకొంటుంటే, తదుపరి ఇంక్రిమెంట్లు ఉండవు. వారికి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇస్తారు. పీఆర్సీ జీవోల్లో ఈ ప్రస్తావన లేదు. మార్గదర్శకాల్లోనూ ప్రస్తావించకపోవడం వల్ల ఆ ఉద్యోగులకు కొత్త స్కేళ్ల స్థిరీకరణ చేయడం సాధ్యం కాదు. స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు లేకుండా స్థిరీకరిస్తే, వారికి అన్యాయం జరుగుతుంది.
పీఆర్సీ బకాయిల చెల్లింపునకు వేరుగా ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. ఎప్పుడు ఇస్తారనే విషయం చెప్పలేదు. ఫలితంగా బకాయిల చెల్లింపుల్లో అనిశ్చితి కొనసాగుతుంది.
పీఆర్సీ జీవోలు జారీ చేసి దాదాపు నెల కావస్తోంది. ఈ నెల రోజుల్లో సీఎఫ్‌ఎంఎస్‌ను సిద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే కొత్త జీతాలు తీసుకోవాలని నిబంధన పెట్టారు. ఫలితంగా.. పీఆర్సీ అమల్లో జాప్యం తప్పదు.
జాప్యానికే సీఎఫ్‌ఎంఎస్
పీఆర్సీ అమలును జాప్యం చేయడానికే సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిందని యూటీఎఫ్, ఎస్టీయూ విమర్శించాయి. పెన్షనర్లు, బకాయిల చెల్లింపు ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టాయి.
పెన్షనర్లకు తప్పని ఎదురు చూపులు
పెన్షనర్లకు అదనపు పెన్షన్ చెల్లింపును విస్మరించాలని జీవో నం.51 ఇచ్చారు. 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు ప్రస్తుతం 15 శాతం అదనపు పెన్షన్ ఇస్తున్నారు. వారికి అదనపు పెన్షన్ ఇవ్వకుండా 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేస్తే.. ఇప్పుడు పొందుతున్న దాని కంటే తక్కువ పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. పీఆర్సీ సిఫారసులను యథావిధిగా ఆమోదిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. కానీ అదనపు పెన్షన్ విషయంలో అస్పష్టమైన జీవో ఇచ్చిన ప్రభుత్వం, అమలు మార్గదర్శకాల్లో స్పష్టత ఇస్తుందని ఆశించిన పెన్షనర్లకు నిరాశే మిగిలింది. పీఆర్సీ అమలు మార్గదర్శకాల్లో పెన్షనర్ల ప్రస్తావనే లేదు. పెన్షన్ స్థిరీకరణకు వేరుగా మార్గదర్శకాలు ఇస్తామని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఎప్పుడు ఇస్తారనే విషయంలో స్పష్టతలేదు.