ఈ-పాలన ఎప్పుడో..?
పల్లెలను ప్రపంచంతో అనుసంధానం చేసే బృహత్తర కార్యక్రమం ఈ-పాలన ఎందుకో జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు పంచాయతీ కార్యాలయాల్లో అలంకార ప్రాయంగా మారాయి. మరో వైపు ఈ-పాలన కోసం పది నెలల క్రితం శిక్షణ ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్లకు నేటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - మిర్యాలగూడ
* నిర్వాహకులు, అధికారుల మధ్య కొరవడిన సమ్వయం
* ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినా.. పోస్టింగ్ ఇవ్వని అధికారులు
* గ్రామపంచాయతీల్లో నిరుపయోగంగా కంప్యూటర్లు
పాలనలో పారదర్శకతతో పాటు మారుమూల గ్రామాలను సైతం ఇంటర్‌నెట్ అనే వ్యవస్థ ద్వారా ప్రపంచంతో అనుసందానం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ-పాలనకు శ్రీకారం చుట్టింది. కానీ నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం నిర్వాహకులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ-పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 2440 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా జిల్లాలోని 171 పంచాయతీలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో నల్లగొండ డివిజన్ పరిధిలో 65, మిర్యాలగూడ డివిజన్‌లో 53, భువనగిరి డివిజన్ పరిధిలో 53 గ్రామాలు ఉన్నాయి. ఎంపిక చేసిన గ్రామాలకు మూడు నెలల క్రితమే కంప్యూటర్లు పంపిణీ చేసి బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్‌నెట్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. కానీ ఆపరేటర్లను నియమించకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి.
పది నెలల క్రితం శిక్షణ
పల్లెల్లో ఇంటర్‌నెట్ ద్వారా పాలన అందించడానికి గానూ కంప్యూటర్ ఆపరేటర్లను పది నెలల క్రితమే ఎంపిక చేశారు. వీరికి హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేసి ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చింది. కానీ ఆపరేటర్లను మాత్రం నియమించలేదు. పంచాయతీలకు కంప్యూటర్లు వచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో శిక్షణ పొందిన అభ్యర్థులు ఆయోమయంలో పడిపోయారు.
జిల్లాలో 237 కంప్యూటర్ల పంపిణీ
జిల్లాలో ఈ-పాలన అమలు చేయడానికి గానూ 237 కంప్యూటర్లు పంపిణీ చేశారు. జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయానికి ఒకటి చొప్పున 59, ఈ-పాలనకు ఎంపికైన గ్రామపంచాయతీలకు 171, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి రెండు, డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు, జిల్లా పరిషత్ కార్యాలయానికి రెండు కంప్యూటర్‌లు కేటాయించిన పంపిణీ చేశారు.