ముందు పాలనపై దృష్టి సారించండి
చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై విమర్శలు మానివేసి ఆంధ్రప్రదేశ్‌లోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి సారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉండడానికి కారణం రాజశేఖరరెడ్డి పాలనేనని చంద్రబాబు విమర్శించడం సమంజసంగా లేదన్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు పరిపాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. మీ పాలనలో రైతాంగం సంక్షోభంలో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. వైఎస్‌ను నిందించే లక్ష్యంతో రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, విజన్ 2020 పత్రాన్ని రూపొందిస్తామని చంద్రబాబు అంటున్నారని, గతంలో శ్వేతపత్రం, విజన్ 2020 గురించి చంద్రబాబు మాట్లాడారంటే అది కొత్త పన్నులను వేయడానికో లేదా ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడానికో అని రాష్ట్ర ప్రజలు భయపడేవారని గుర్తుచేశారు. ఇపుడు మళ్లీ అదే మాటలు చెబుతున్నారంటే రైతుల రుణమాఫీని నీరుగార్చడానికో లేదా వైఎస్ సంక్షేమ పథకాలను కుదించడానికో అనే అనుమానాలు, భయాందోళనలు ప్రజల్లో కలుగుతున్నాయని చెప్పారు.