
మాదిగలకు ద్రోహం చేసిన చంద్రబాబు
- ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీని ముట్టడిస్తాం
- రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
షాబాద్ : వర్గీకరణ విషయంలో మాదిగలకు చంద్రబాబు ద్రోహం చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. షాబాద్ మండలంలోని నాగరగూడచౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాదిగలకు అన్యాయం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తే బొందపెట్టేది ఖాయమన్నారు.
అంబేద్కర్ ఆశయసాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వర్గీకరణ కోసం వచ్చే నెలలో ఢిల్లీని ముట్టడిస్తామన్నారు. బాబూ జగ్జీవన్‌రాం, కాన్షీరాం ఆశయాల సాధన కోసం మాదిగలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిందన్నారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేంతవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. దండోరా పేరుతో 20 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ మాదిగలకు అన్యాయం చేశారన్నారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం భూ పంపిణీ , క ల్యాణలక్ష్మి, విదేశాల్లో చదివే దళిత విద్యార్థులకు ఆర్థికసాయంలాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులోభాగంగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వంద కోట్లతో దళితుల అభ్యున్నతికి కేటాయించామన్నారు.
భూమిలేని దళితుల కోసం భూ కోనుగోలుకు జిల్లాలో రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు రాందాస్, శ్రీనివాస్, రమేశ్, శంకర్, జోగు అశోక్‌కుమార్, జోగు వెంకటయ్య, రాజారత్నం, రవికుమార్, నరసింహులు, గోపాల్, కిరణ్, పెంటయ్య, రామకృష్ణ, అంజిబాబు, వీరబాబు, పరిగి రవి, వెంకటేష్, రవీందర్, పాండు, బుచ్చయ్య, అబ్రహాం, వెంకటయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.