
మాజీ జర్నలిస్టు రవీందర్ మృతి
సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రముఖుల సంతాపం
నేడు స్వస్థలం కరీంనగర్ జిల్లా రాయికల్‌లో అంత్యక్రియలు
హైదరాబాద్/రాయికల్: మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ జర్నలిస్టు, మంత్రి ఈటల రాజేందర్ పీఆర్వో దాసరి రవీందర్ శనివారం సాయంత్రం కన్నుమూశారు. తలనొప్పితో బాధపడుతూ వారం రోజుల కింద వైద్య పరీక్షలు చేయించుకోగా బ్రెయిన్ ఎన్యుమరిజంతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించడంతో ఈ నెల 13న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.రవీందర్ మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రవీందర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రులు నాయిని, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌లు ఆస్పత్రికి వచ్చి రవీందర్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆస్పత్రిలో ఎంపీ కవిత, మంత్రి ఈటల రాజేందర్ రవీందర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రవీందర్ కుటుంబ సభ్యులను శనివారం మధ్యాహ్నం సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి పరామర్శించారు. రవీందర్ మృతికి కారణమైన ఆస్పత్రి వైద్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ ఆస్పత్రికి వచ్చిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని నిలదీశారు.
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు...
కరీంనగర్ జిల్లా రాయికల్‌కు చెందిన రవీందర్ మీడియూ రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. సాక్షి టీవీ, తేజ టీవీ, ఈటీవీ, టీవీ 5ల్లో పనిచేశారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ కరస్పాండెంట్‌గా అవార్డు కూడా పొందారు. ఆయనకు భార్య సరిత, పిల్లలు సహర్ష్, శ్రుతి ఉన్నారు. ఆదివారం స్వస్థలం రాయికల్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు ఈటలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.