
డీఎడ్ ఉంటుందా? లేదా?
- డీఈఈసెట్-2015 నోటిఫికేషన్ కోసం 1.5 లక్షల మంది ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సుల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహించాల్సిన ప్రవేశపరీక్ష డైట్‌సెట్ (డీఈఈసెట్-2015) నోటిఫికేషన్ కోసం విద్యార్థులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తరగతులు ప్రారంభించే సమయం వచ్చినా ఇంతవరకు నోటిఫికేషనే జారీ కాలేదు. అసలు ఈ ఏడాది డీఎడ్ కోర్సులో ప్రవేశాలు చేపడతారా? లేదా? అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చడం లేదు. దీంతో ఇంటర్ పూర్తి చేసుకుని డైట్‌సెట్ కోసం లక్షన్నర మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. డీఎడ్ కోసం ఎదురుచూస్తూ.. డిగ్రీ కోర్సుల్లో చేరలేక వారు ఆందోళన చెందుతున్నారు.
నోటిఫికేషన్‌పై తేల్చని ప్రభుత్వం
రాష్ట్రంలోని 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు, 10 ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో(డైట్) ప్రవేశాలు చేపట్టేందుకు డైట్‌సెట్‌ను నిర్వహించాలి. ఈ నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇవ్వాలని విద్యా శాఖ 3 నెలల కిందే ప్రభుత్వానికి ఫైలు పంపింది. కానీ ప్రభుత్వం ఇంతవరకూ ఈ వ్యవహారాన్ని తేల్చలేదు. ఏమంటే తెలంగాణలో సొంతంగా డైట్‌సెట్ నిర్వహణకు చట్టాన్ని అడాప్ట్ చేసుకోవాలని చెబుతోంది తప్ప ఆ చర్యలను వేగవంతం చేయడం లేదు. దీంతో 3 నెలలూ అయిపోయాయి. ఆలస్యం చేస్తే గతంలోలాగే డీఎడ్ ప్రవేశాలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడనుంది.
డైట్‌సెట్‌పై అనుమానాలు..
ఈ ఏడాది డైట్‌సెట్ ద్వారా ప్రవేశాలు చేపట్టకూడదన్న ఆలోచనలు ప్రభుత్వ వర్గాల్లో నెలకొన్నట్లు విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2014 జూన్/జూలైలో జరగాల్సిన డీఎడ్ ప్రవేశాలు 2015 జనవరిలో ప్రారంభమై ఫిబ్రవరిలో ముగిశాయి. ఆ బ్యాచ్ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే తరగతులు ప్రారంభమయ్యాయి. మళ్లీ 2015-16 విద్యా సంవత్సర ప్రవేశాలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. అయితే 2 బ్యాచ్‌లకు మధ్య పెద్ద సమయం లేకపోవడంతో ఈసారి ప్రవేశాలను నిలిపేస్తారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డైట్‌సెట్‌ను నిర్వహిస్తారా? లేదా? అన్న విషయాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నారు. డైట్‌సెట్ కోసం ఎదురుచూస్తూ ఇతర కోర్సుల్లో చేరక.. విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.