
పేరు నిలపని పెద్దరికం
జిల్లాకు అచ్చిరాని పీసీసీ పీఠం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి జిల్లాకు అస్సలు కలిసి రాలేదు. కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ర్టస్థాయిలో ఉన్నత స్థాయి పదవి పీసీసీ చీఫ్. అలాంటి పీఠాన్ని జిల్లా నేతలు రెండు సార్లు అధిరోహించారు. వీరి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన రెండు పర్యాయూలు కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడమే కాకుండా... ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే స్థాయిలోనైనా స్థానాలను గెలచుకోలేకపోయింది. పీసీసీ చీఫ్ పదవిని జిల్లాకు చెందిన మహ్మద్ కమాలుద్దీన్ అహ్మద్, పొన్నాల లక్ష్మ య్య చేపట్టారు.
జనగామ నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జిల్లాలో ఒకే అసెంబ్లీ స్థానం దక్కింది. 1999 ఎన్నికల ముందు వరకు లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు వేర్వేరుగా వచ్చేవి. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన కమాలుద్దీన్ అహ్మద్ నియమితులయ్యారు. అప్పుడు ఆయన హన్మకొండ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. జిల్లా నుంచి పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పీవీ.నర్సింహారావు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 1994లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పీవీతోపాటు కమాలుద్దీన్ అహ్మద్‌కు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి.
ఈ ఎన్నికల్లో అంతుకుముందు ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. చివరకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లే దక్కాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా సైతం దక్కలేదు. పీసీసీ చీఫ్ కమాలుద్దీన్ అహ్మద్ సొంత జిల్లాలో కేవలం డోర్నకల్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. డీఎస్.రెడ్యానాయక్ మాత్రమే గెలిచారు. ఎన్నికల వరకు జిల్లాలో మంత్రులుగా ఉన్న పీవీ.రంగారావు, టి.పురుషోత్తమరావు, మాదాడి నర్సింహారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పి.జగన్నాయక్ వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యూరు. 1994 ఎన్నికల్లో వచ్చినంత దారుణ ఓటమి కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కమాలుద్దీన్ అహ్మద్ హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ గెలిచారు.
ఇప్పుడూ అదే తీరు...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందే ప్రత్యేకంగా పీసీసీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం కల్పించింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను నియమించింది. తెలంగాణ ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్‌కు విజయం తప్పదని అంచనాలతో ఎన్నికల్లో ముందుకు సాగారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత... తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని పొన్నాల లక్ష్మయ్య, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రకటించారు. తీరా... ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతల అంచనాలను తారుమారు చేశాయి. 1994 ఫలితాలే పునరావృతమయ్యాయి.
అప్పటిలాగే కాంగ్రెస్‌కు జిల్లాలో ఒకే స్థానం వచ్చింది. అదీ డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్. మిగిలిన 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య సైతం ఓడిపోయారు. శాసనసభకు, లోక్‌సభకు సంయుక్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఓడిపోయింది.