మోసపోయా: జానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తారని గంపెడాశలు పెట్టుకున్న జానారెడ్డికి హైకమాండ్ పెద్దలు ఝలక్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం, ఆవేదనకు లోనైట్లు తెలిసింది. హైకమాండ్ పెద్దలు తనను నమ్మించి మోసం చేశారని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు... కొద్దిరోజుల కిందట దిగ్విజయ్‌సింగ్ జానారెడ్డికి ఫోన్ చేసి ‘టీపీసీసీ అధ్యక్షుడిగా మేడం మీపేరునే ఖరారు చేశారు. రెండు, మూడురోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం. ఈలోపు పీసీసీ ఎన్నికల, ప్రచార, మేనిఫెస్టో కమిటీల్లో ఎవరెవ రికి చోటు కల్పిస్తే బాగుంటుందనే అంశంపై ఓ జాబితాను రూపొందించి పంపండి. అదే సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపైనా తెలంగాణ నేతల అభిప్రాయాలు తెలుసుకోండి’ అని చెప్పారు.
మంగళవారం సాయంత్రం ఉన్నట్లుండి టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పేరును ఖరారు చేస్తూ ప్రకటనను వెలువరిండంతో జానారెడ్డి షాక్‌కు గురయ్యారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్‌కు ఫోన్ చేసి.. ‘‘నేనేమైనా పీసీసీ అధ్యక్ష పదవి కావాలని అడిగానా? మీరే ఆశచూపారు. న మ్మించి మోసం చేశారు. నాలాంటి సీనియర్‌ను ఎందుకిలా అవమానించారు’’అని మండి పడ్డారు. విస్తుపోయిన దిగ్విజయ్‌సింగ్ సామాజిక కోణంలో పదవి ఇవ్వలేకపోయామంటూ బుజ్జగించేందుకు ప్రయత్నించబోయారు. జానారెడ్డి శాంతించకపోవడంతో వెంటనే ఢిల్లీ రావాలని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఢిల్లీవెళ్లిన జానారెడ్డిని గురువారం దిగ్విజయ్‌సింగ్ స్వయంగా వెంటబెట్టుకుని సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు. టీపీసీసీ పదవి ఇవ్వలేకపోయినందుకు ఆవేదనను వ్యక్తం చేసిన సోనియాగాంధీ భవిష్యత్తులో మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో అయిష్టంగానే వెనుదిరిగారు.