సాక్షి, హైదరాబాద్: వయసురీత్యా రాజకీయాల నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తెలిపారు. తనకు ఇప్పుడు 75 ఏళ్లు ఉన్నాయని, అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటిం చారు. తనకు రాజకీయాలపై వైరాగ్యం లేదంటూనే, ఇంకా తాను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిచినా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడినని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. తనపై విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను అభినందించారు. ఆదివారం సాగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు, ప్రజాస్వామ్య విలువల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. ఈ ఎన్నికల వల్ల కాంగ్రెస్ కోల్పోయింది ఏమీ లేదన్నారు. మున్ముందు ఎన్నికలు కూడా ఇలాగే ఉంటాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చదవండి: (సాగర్ టీఆర్‌ఎస్‌దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం)
వైరాగ్యం ఏమీ లేదు..
20 ఏళ్ల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 11 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని జానారెడ్డి తెలిపారు. అయినా తనకు రాజకీయాలపై విరక్తి, వైరాగ్యం లేవని చెప్పారు. బీజేపీని నిర్మించిన ఎల్‌కే అద్వానీ లాంటి నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. తాను నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయలేదనడంలో వాస్తవం లేదని, తాను శాశ్వత ప్రాతిపదికన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. తాత్కాలిక పథకాల వల్ల అభివృద్ధి జరగదనే విషయం కొంత కాలం తర్వాత ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాను తన బయో గ్రఫీ రాసుకోనని, ఎవరైనా రాసేందుకు ముందుకు వస్తే అన్ని విషయాలు చెప్తానని తెలిపారు.
అది హైకమాండ్ చూసుకుంటుంది
టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ ఇష్టమని, అధ్యక్ష ఎంపిక వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని జానారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లతో పాటు పార్టీ శ్రేణులన్నీ కలసి పనిచేశాయని చెప్పారు. అటు టీఆర్‌ఎస్ పార్టీ, ఇటు ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేసినా కాంగ్రెస్ సత్తా చాటిందని వ్యాఖ్యానించారు. ఈ ఉత్సాహంతోనే కాంగ్రెస్ శ్రేణులు మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా నెమ్మదించిన తర్వాత అందర్నీ కలుస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment