KCR Strategy: సాగర్‌ బరి.. ‘సార్‌’ గురి! | TRS Party Strategy Success In Nagarjuna Sagar Election | Sakshi
Sakshi News home page

KCR Strategy: సాగర్‌ బరి.. ‘సార్‌’ గురి!

Published Mon, May 3 2021 1:58 AM | Last Updated on Mon, May 3 2021 1:23 PM

TRS Party Strategy Success In Nagarjuna Sagar Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.. చేదు అనుభవాలను అధిగమించింది.. తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుంటోంది. దుబ్బాక, గ్రేటర్‌ ఫోబియా నుంచి బయటపడి విజయాలబాట పట్టింది. నాగార్జున సాగర్‌ తీరాన మళ్లీ షి‘కారు’చేస్తోంది.. ఇటీవలి శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో సవాళ్లను దీటుగా ఎదుర్కొని సానుకూల ఫలితాన్ని సాధించింది.

తాజాగా సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక టీఆర్‌ఎస్‌కు గెలుపు టానిక్‌ అందించింది. దీని వెనుక ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేసిన పక్కా ప్లాన్‌ ఉంది. పటిష్ట వ్యూహం ఉంది. ఉపఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే పార్టీ యంత్రాంగం సన్నద్ధత, సమన్వయానికి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఫలితాలతీరు పునరావృతం కాకుండా సాగర్‌ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు.  చదవండి: (సాగర్‌ తీర్పు: జానారెడ్డి షాకింగ్‌ నిర్ణయం)

నివేదికలు.. సర్వేలు.. సన్నద్ధత 
గత ఏడాది డిసెంబర్‌ రెండోవారం నుంచే సాగర్‌ నియోజకవర్గంపై దృష్టి సారించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుని పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు. సామాజికవర్గాల ఓటర్ల సంఖ్య, పార్టీ సంస్థాగత బలం, కాంగ్రెస్, ఇతర పార్టీల బలాబలాలు వంటి అంశాలను లోతుగా విశ్లేషించి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే సాగర్‌ ఉపఎన్నిక జరుగుతుందనే అంచనాతో సుమారు నాలుగు నెలల ముందు నుంచే పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మండలాలవారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారాన్ని కూడా అంతర్భాగం చేశారు.

చురుకైన ఎమ్మెల్యేలు.. మెరుగైన ప్రచారం.
సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదే సామాజికవర్గాల ఎమ్మెల్యేలతోపాటు కొందరు చురుకైన ఎమ్మెల్యేల బృందానికి ప్రచార, సమన్వయబాధ్యతలను కేసీఆర్‌ అప్పగించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, శంకర్‌నాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఎన్‌.భాస్కర్‌రావు, కోరుకంటి చందర్, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావులను సాగర్‌ పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మంత్రులు శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌ అలీ వివిధవర్గాల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించారు. బహిరంగ సభల్లో వాటి పరిష్కారాలకు కేసీఆర్‌ హామీనిచ్చారు.  

అభ్యర్థి ఎంపిక.. విపక్షాలకు ముకుతాడు 
నర్సింహయ్య కుమారుడు భగత్‌తోపాటు సీనియర్‌ నేత ఎంసీ కోటిరెడ్డి, మరో అరడజను మంది నేతలు టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం పోటీపడ్డారు. అయితే, అభ్యర్థి ఎంపికపై కేసీఆర్‌ చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించిన తర్వాత భగత్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతోపాటు కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. జానా రెడ్డి నుంచి గట్టిపోటీ తప్పదని గ్రహించిన కేసీఆర్‌ ఆయనకు పట్టు ఉన్న సామాజికవర్గాలు, గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

బీజేపీ ప్రభావం పెద్దగా ఉండబోదని ముందే అంచనాకు వచ్చిన కేసీఆర్‌ ఆ పార్టీని మరింత బలహీనపర్చాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడిన కడారి అంజయ్య యాదవ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని కమలనాథులను ఆత్మరక్షణలోకి నెట్టారు. తన ప్రసంగాల్లో ఎక్కడా బీజేపీ పేరును ప్రస్తావించని కేసీఆర్, ఆ పార్టీకి డిపాజిట్‌ దక్కకుండా చేసి ‘సాగర్‌’వేదికగా చావుదెబ్బ కొట్టాలని భావించారు. ఈ మేరకు బీజేపీకి డిపాజిట్‌ గల్లంతు చేశారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరా బాద్‌ ఫలితాలతో తలెత్తిన ఫోబియా నుంచి పార్టీ ని బయటకు తేవడంలో కేసీఆర్‌ సఫలమైనట్లు సాగర్‌ ఉపఎన్నిక ఫలితంతో తేటతెల్లమైంది.  

చదవండి: (సాగర్‌ టీఆర్‌ఎస్‌దే.. ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement