
బుల్లెట్ ఎవరిది?
♦ మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కొడుకుపై కాల్పులు!
♦ రెండు భుజాల్లోకి దూసుకెళ్లిన తూటాలు
♦ శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఘటన
♦ అన్నదానానికి దర్గాకు వెళ్లే యత్నాల్లో ఉండగా కాల్పులు
♦ ఎవరు కాల్చారన్న అంశంపై నోరు విప్పని విక్రమ్ గౌడ్
♦ అప్పులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తానే కాల్చుకున్నారా అని అనుమానాలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాల్పుల ఘటనపై విక్రమ్ నోరు మెదపట్లేదు. దీంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం, సమీపంలో కెమెరాలు లేకపోవడంతో కీలకాధారాలు లభించలేదు. అప్పులు పెరిగిపోవడంతోపాటు తనను దూరంగా ఉంచుతున్న కుటుంబీకులను బెదిరించేందు కు ఆయనే కాల్చుకొని ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అర్ధరాత్రి ఇంటికి వచ్చి..
విక్రమ్ భార్య షిపాలి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.86లోని ప్లాట్ నం.459లో విక్రమ్ తొమ్మిది నెలల క్రితం అద్దెకు దిగారు. భార్యా పిల్లలతో కలసి నివసిస్తున్నారు. కొన్ని చిత్రాలు కూడా నిర్మించిన విక్రమ్ గౌడ్ ప్రస్తుతం అందుకు సంబంధించి ఓ కార్యాలయం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బయట నుంచి ఇంటికొచ్చిన విక్రమ్ 9 గంటలకు మరోసారి వెళ్లారు. ఫిల్మ్‌నగర్ రోడ్ నం–1 సమీపంలో ఉండే చాంద్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత తెల్లవారుజామున 2–2.20 గంటల మధ్యలో ఇంటికి వచ్చారు.
డూప్లెక్స్ ఇంటిపై భాగంలో నిద్రిస్తున్న భార్యను నిద్రలేపి సమీపంలో ఉన్న హకీంబాబా దర్గాలో పేదలకు అన్నదానం చేద్దాం.. సిద్ధమవాలని సూచించారు. రెడీ అయి 3.20 గంటల ప్రాంతంలో కిందికి వచ్చి డ్రాయింగ్ రూమ్‌లో విక్రమ్ కూర్చున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో భార్య కిందకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె మెట్లు దిగుతుండగా.. డ్రాయింగ్ రూమ్ నుంచి కాల్పుల శబ్దం, భర్త అరుపులు వినిపించాయి. దీంతో ఆమె కంగారుగా డ్రాయింగ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా.. విక్రమ్ సోఫాలో రక్తపుమడుగులో కనిపించారు. ఎవరో వచ్చి తనపై కాల్పులు జరిపారని భార్యతో చెప్పారు. వెంటనే షిపాలి వాచ్‌మెన్ శ్రీనివాస్‌తో పాటు డ్రైవర్లు శ్రీకాంత్, గోపీల సాయంతో కారులో చేర్చి అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో కుడి చేతి భుజంలో దిగిన తూటా బయటకు వచ్చేయగా.. ఎడమ భుజంలో దిగి ఇరుక్కుపోయిన బుల్లెట్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి తీశారు.
ఇంటి చుట్టూనే తిరిగిన శునకం..
ఘటనా స్థలంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌లతో పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసు డాగ్ ఇంటి చుట్టూనే తిరిగిందని, ఒకసారి గేటు బయటకు వచ్చి మళ్లీ లోనికి వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు. డ్రాయింగ్ రూమ్‌లో రెండు ఖాళీ తూటాలు (ఖాళీ క్యాట్రిడ్జ్), విక్రమ్ కుడి భుజం నుంచి బయటకు వచ్చిన మరో కాల్చిన తూటాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న రక్తాన్ని వాచ్‌మన్ శ్రీనివాస్ కొంతమేర తుడిచేయగా.. ఆయన కుమారుడు నాగేంద్ర అడ్డుకున్నారు.
సోఫా, నేలపై పడిన రక్తపు మరకల నుంచి పోలీసుల నమూనాలు సేకరించారు. కాల్పులకు వాడింది నాటు పిస్టల్‌గా భావిస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు ఎంతగా ప్రశ్నించినా.. తనపై కాల్పులు జరిపింది ఎవరో తెలుసునని, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటానని చెప్పారు. కేసు దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేసినట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు. విక్రమ్ తనకు తాను కాల్చుకున్నారా? లేక ఎవరైనా కాల్పులు జరిపారా? అన్న కోణాలనూ పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
ఆద్యంతం మిస్టరీ..
షిపాలి ఫిర్యాదు, ఘటనాస్థలి, వాచ్‌మెన్ చెబుతున్న విషయాలు, గాయాలను పరిశీలించిన పోలీసులు, ఫొరెన్సిక్ నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ఇటీవల అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. విక్రమ్ ఇటీవలే ఓ స్టూడియో ఏర్పాటు చేశారని, అది రెండున్నర నెలల్లో రూ.1.5 కోట్ల నష్టాల్ని తెచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఆయన ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. తమకు చెల్లించాల్సిన రూ.లక్షలు తిరిగి ఇవ్వాల్సిందిగా కొందరు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఆయన్ను కోరినట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 35 సందేశాలను గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే కొద్దిరోజుల నుంచి కుటుంబ కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది.
తన తండ్రి నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేదని విక్రమ్ కొద్దిరోజుల నుంచి స్నేహితులతో చెప్పుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి ఇవి కూడా కారణమా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఇష్క్’ సినిమాలకు విక్రమ్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విక్రమ్ ఇంట్లో పోలీసులు దాదాపు ఆరు గంటలపాటు తుపాకీ ఆచూకీ కోసం గాలించినా దొరకలేదు. ఇటీవల రద్దయిన తన ఆయుధ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవడానికి విక్రమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మరోవైపు హకీంబాబా దర్గాలో పేదలకు అన్నదానం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు జరిగినట్లు విక్రమ్ భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ దర్గా నిర్వాహకులు మాత్రం తమ వద్ద అన్నదానాలు వంటివి జరగవని, తమకు విక్రమ్ ఆయన సంబంధీకుల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. వాచ్‌మన్‌ను పోలీసులు విచారించగా.. కాల్పుల శబ్దం వినిపించిందని, ఆ సమయంలో ఎవరూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు లేదని తెలిపాడు.