సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దేశంలోనే తొలిసారిగా ‘మధోమథన సదస్సు’లను మన రాష్ట్రం నుంచి మొదలు పెడుతోంది. ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని ‘శ్రీ ఇందు కాలేజీ’లో ఈ సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ సదస్సు 23,24వ తేదీల్లో నిర్వహించాలని భావించినప్పటికీ, అనివార్యకారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పలువురు ముఖ్యనేతలు ఇటీవల ఇందు కళాశాలను సందర్శించి.. సదస్సు వేదికను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్ల తయారీలో పార్టీ నిమగ్నమైంది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహా తాజాగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజ యానికి దారితీసిన అంశాలు... పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ రెండు రోజుల సమావేశంలో ఖరారు చేయనున్నారు.
తొలిరోజు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పెలైట్ హాజరుకానుండగా, రెండోరోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్‌వర్గాలు తెలిపాయి. రెండు రోజుల సదస్సుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, జాతీయ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి జైరాంరమేశ్, కుంతియా తదితరులు రానున్నారు.
ఒక రోజు ఆలస్యంగా కాంగ్రెస్ మేధోమథనం
Published Tue, Aug 12 2014 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement