కాంగ్రెస్ ‘ఆకర్ష్’ మంత్ర..!
► నిరుద్యోగులకు రూ.3వేలు.. రైతుల రుణమాఫీ రూ.2 లక్షలు
► వికలాంగులకు రూ.2,500
► ఎన్నికల వరాలను సిద్ధం చేస్తున్న టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించడానికి అనుసరిం చాల్సిన పథకాలు, ప్రకటనలు, హామీలపై టీపీసీసీ భారీగా కసరత్తు చేస్తోంది. టీపీసీసీ ముఖ్యనేతలు ప్రజాకర్షక పథకాలపై వివిధ వర్గాల నిపుణులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సంఘాలతో ఆంతరంగిక చర్చలు జరుపుతు న్నారు.
నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నారు. తెలంగాణరాష్ట్రంలో నినాదాలుగా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించారు. నియామకాల విషయంలో యువతలో ఉన్న అసంతృప్తిని టీఆర్‌ఎస్ పట్టించుకోవడంలేదని, ప్రభుత్వశాఖల్లోనూ, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఖాళీలను భర్తీ చేయకుండా చేస్తున్న నిర్లక్ష్యాన్ని తనకు అను కూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.
నిరుద్యోగులకు భృతి..
తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగం లేదా ఉపాధి దొరికే వరకూ భృతిని అందిం చాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసిన యువతకు నెలకు రూ.3వేలు భృతిగా ఇవ్వనుంది. దాదాపు 10 లక్షల మంది డిగ్రీ పూర్తిచేసిన వారుంటారని టీపీసీసీ అంచనా. ఇందుకు నెలకు రూ.3వేల కోట్లు, ఏడాదికి రూ.36వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుం దని భావిస్తోంది. దీనిపై మరింత అధ్య యనం చేయనుంది. అందుకే నిరుద్యోగభృతి ఇస్తామన్నా... నెలకు ఎంతన్నది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించలేదు.
రైతులకు భరోసా...
ఇక రైతులను ఆకర్షించేందుకు రుణమాఫీని మరింత వెసులుబాటుతో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రణాళిక. దీన్ని కేవలం పంటరుణాలకే పరిమితం చేయకుండా టర్మ్ లోన్‌కు కూడా రూ.2లక్షల దాకా రుణామాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించనుంది. దీనిపై దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో 2లక్షల వరకూ అన్ని రుణాలను మాఫీ చేయాలని టీపీసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రైతులకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటి కనీస అవసరాలకోసం ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.రైతులకు ఎకరానికి ఎంత ఇవ్వాలనే దానిపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనతో కాంగ్రెస్‌లో అంతర్గ తంగా నేతలపై పరస్పర అనుమానాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. పింఛను పరం గా వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ.1,000ని రెట్టింపు చేసి 2,000 ఇవ్వనుంది.
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే వికలాంగులకు ఇస్తున్న రూ.1,500కు బదులు రూ.2,500 ఇవ్వాలని నిర్ణయించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరంగా అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరోగదిని ఇస్తామని గతంలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మహిళలకు, విద్యార్థులకు, పాడి రైతులకు ప్రత్యేకంగా పలు వరాలను ప్రకటించడానికి టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది.