కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. మహా కూటమి పొత్తులో భాగంగా రూరల్, బాల్కొండ స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఆ పార్టీ అభ్యర్థిగా జిల్లాలో పోటీ చేసేందుకు ఆశావహులు సాహసించకపోవడంతో ఆ స్థానాలు భూపతిరెడ్డి, ఈరవత్రి అనీల్‌లకు ఖరారయ్యాయి.
సాక్షి, నిజామాబాద్: తీవ్ర ఉత్కంఠగా సాగిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మూడు స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ స్థానం ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డికి దక్కింది. నిజామాబాద్ అర్బన్ నుంచి డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్‌కు అవకాశం లభించింది. బాల్కొండ నుంచి ఈరవత్రి అనీల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కూటమి పొత్తులో భాగంగా రూరల్, బాల్కొండ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ అభ్యర్థిగా జిల్లాలో పోటీ చేసేందుకు ఆశావహులు సాహసించలేదు. టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే ఆ స్థానంపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని భావించిన కాంగ్రెస్ జిల్లాలో ఏ ఒక్క స్థానాన్ని కూడా టీడీపీకి కేటాయించేందుకు అంగీకరించలేదు. దీంతో ఈ స్థానాలు భూపతిరెడ్డి, ఈరవత్రి అనీల్‌లకు ఖరారయ్యాయి.
విధేయతకు దక్కిన అవకాశం..
నిజామాబాద్ అర్బన్ స్థానానికి తాహెర్‌బిన్ హందాన్‌కు కేటాయించడం పై కాంగ్రెస్ పార్టీలో విధేయతకు అవకాశం దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీసీసీ అధ్య క్షునిగా సేవలందిస్తున్న తాహెర్ మూడు దశాబ్దాల క్రితం ఇదే అర్బన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి చివరి వరకూ మహేష్‌కుమార్ గౌడ్ పేరు పరిశీలనలోకి వచ్చింది. కాగా అనూహ్యంగా తాహెర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. పార్టీని నమ్ము కుని పని చేసిన కార్యకర్తలకు అవకాశాలు ఉంటాయని చెప్పడానికి ఇది నిదర్శనమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రూరల్ బరిలో భూపతిరెడ్డి..
నిజామాబాద్ రూరల్ స్థానానికి డాక్టర్ భూపతిరెడ్డి పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ స్థానం టీడీపీకి కేటాయిస్తారని, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ స్థానం కూటమి కోరుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగిన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భూపతిరెడ్డికి టికెట్ కేటాయించడంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
బాల్కొండ ఈరవత్రికే..
బాల్కొండ స్థానం ఈరవత్రి అనీల్‌కే దక్కింది. ఈ స్థానం కూడా పొత్తులో టీడీపీకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేస్తారని ఊహాగానాలు విన్పించాయి. టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే కాంగ్రెస్‌కు ఓట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆయన సైకిల్‌పై పోటీకి సంశయించారు. కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి వరకూ కొనసాగిన ఉత్కంఠకు తెరతీస్తూ బాల్కొండ బరిలో ఈరవత్రి అనీల్‌ను నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment