
మెట్‌పల్లి/మల్లాపూర్: లాభాలతో నడిచే చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయడంలో కుట్ర దాగుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆయన ఆదివారం సందర్శించారు. మెట్‌పల్లిలో కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కెరతోపాటు మరికొన్ని అదనపు ఉత్పత్తులను అందించే ఫ్యాక్టరీలతో నష్టాలు వచ్చే అవకాశాలుండవని, కానీ, ప్రభుత్వం నష్టాలపేరుతో వాటిని మూసివేయడం సరికాదన్నారు.
ఫ్యాక్టరీలు మూసివేసిన మూడు ప్రాంతాల్లో రైతులు వేర్వేరుగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని, సంఘటితంగా పోరాడటానికి తొందరలోనే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీలపై హామీలిచ్చి నిలబెట్టుకోని నేతలను గ్రామాల్లోకి రానివ్వబోమంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వారి వైఖరిలో మార్పు వచ్చే అవకాశముందన్నారు.
అక్రమంగా ప్రకటించిన లే ఆఫ్‌ను ఎత్తివేయించి ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడిపించేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతుల ఉద్యమానికి టీజేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు, చెరకు ఉత్పత్తిదారుల సంఘం, పునరుద్ధరణ కమిటీల అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, గురిజెల రాజి రెడ్డి, జేఏసీ నేతలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment