వెంకటగిరిలో శుక్రవారం తొలగించిన చివరి కంటైన్మెంట్ ఇదే
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెడ్ జోన్లన్నీ తొలగించారు. నగరంలో రెడ్ జోన్లు ప్రకటించిన కొద్దిరోజులకే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం (జీహెచ్‌ఎంసీ సర్కిల్–19) పరిధిలోని బోరబండ, రాజీవ్‌నగర్, జయంతినగర్, వెంకటగిరి ప్రాంతాల్లో కరోనా కేసులు రావడం, అందులో రాజీవ్‌నగర్‌లో ఒకరు మృతిచెందారు. దాంతో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయా ఏరియాలను అష్టదిగ్బంధనం చేశారు. నాలుగు ప్రాంతాల్లో కలిపి దాదాపు 3,740 మంది జనాభా ఉన్నారు. ఈ నాలుగు ఏరియాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. వారి ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలను రెడ్‌జోన్ల పరిధిల్లో ఉన్న ప్రజలకు అందించారు. నిరంతరం కూరగాయలు, మెడిసిన్స్, నిత్యావసర సరుకులు వారికి అందేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిరంతర పర్యవేక్షణకు పోలీసు అధికారుల సహకారం అందించడంతో మూడు రోజుల కిందట మూడు ప్రాంతాల్లో ఉన్న రెడ్‌జోన్లు బోరబండ, జయంతినగర్, రాజీవ్‌నగర్‌లను తొలగించారు. ప్రస్తుతం తాజాగా శుక్రవారం మిగిలి ఉన్న వెంకటగిరి ప్రాంతాన్ని కూడా తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ, పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా రెండు వారాలకు పైగా కంటైన్మెంట్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నందు వల్లనే ఇక్కడ తిరిగి మొదటి పరిస్థితి నెలకొందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితులు అదుపులోకి వచ్చినందుకే ఎత్తేశాం
సర్కిల్–19 పరిధిలో కరోనా కేసులు నమోదు కావడం వల్లనే కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. నాలుగు కంటైన్మెంట్లను అష్టదిగ్బంధనం చేసి లోపల ఉన్న వారిని బయటకు పంపకుండా, బయట వారిని లోనికి అనుమతించకుండా ఆయా ఏరియాల్లో ప్రత్యేక గుడారాలు వేసి నిరంతరం పోలీసుల సహకారంతో మా నోడల్ అధికారులు పర్యవేక్షించారు. వారికి కావాల్సిన కూరగాయలు, సరుకులతో పాటుగా అన్ని వస్తువులు ఇళ్ల వద్దకే అందజేశారు. ప్రజలు కూడా మాకు సహకరించారు. మొత్తం 13 పాజిటివ్ కేసుల్లో ఒకరు చనిపోయారు. ఒకరిని గాంధీకి, మరొకరిని ఛాతీ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని డిశ్చార్చ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మామూలుగా మారిపోయాయి. – రమేష్, ఉప కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment