ఈ మరణాలు ఆగవా.. ?
ఏజెన్సీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
- ఇప్పటికే 11మంది కన్నుమూత
- పారిశుధ్యం, వైద్యసేవల్లో లోపమే కారణమంటున్న ఆదివాసీలు
జైనూర్ : ఉట్నూర్ ఏజెన్సీలోని జైనూర్, సిర్పూర్-యూ తదితర ఏజెన్సీ గ్రామాల్లో మరణాలు ఆగడం లేదు. జ్వరాలతో పాటు ఇతరత్రా వ్యాధులు ప్రబలడంతో ప్రతిరోజూ ఒకరు లేదా ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తీవ్రంగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్య లోపానికి తోడు సరైన వైద్యసేవలందకే మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలుస్తోంది.
మొన్న ఇద్దరు.. నిన్న ఇద్దరు
జ్వరాల బారిన పడి సరైన వైద్యసేవలందక జైనూర్ మండలంలోని అడ్డెసారకు చెందిన గిరిజన బాలిక పంద్ర తాటిగూడకు చెందిన ధనలక్ష్మి (8), జంగాం కిషన్‌నాయక్‌తండాకు చెందిన రాథోడ్ దుర్రిబాయి(45) శుక్రవారం మృతి చెందారు. ఇక సిర్పూర్-యూ సీతాగోంది గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి ఆత్రంయశ్వం త్‌రావు(11)తోపాటు కనక దేవుబాయి(60) శనివారం మృతి చెందారు. ఇలా ఇప్పటివరకు పరిశీలిస్తే గత నెల నుంచి 11మంది వరకు మృతి చెందిన ట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా మెరుగైన వైద్యం అందక పలువురు మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, కొన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేస్తున్నా సరిపడా మందులు అందజేయకపోవడంతో ఫలితం ఉండడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి పరిస్థితి నెలకొంటోంది. అలాగే, సిర్పూర్- యూ మండలం పంగడి సబ్‌సెం టర్‌కు ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉండడంతో వైద్య సేవలందడం లేదని పం గిడి సర్పంచ్ జాలింషా తెలిపారు. జైనూర్ పీహెచ్‌సీలో శనివారం అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభాకర్, డీఎంఓ అల్హం రవి నిర్వహించిన సమీక్ష పమావేశంలో పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ సరైన మందులు లేవని చెప్పడం శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇకనైనా మృతుల సంఖ్య పెరగకముందే అధికారులు మేల్కొని జ్వరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.