‘సమగ్ర’ నమోదు వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం కలిగించాయి. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆమె నవీపేట మండలం పోతంగల్‌లో, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ వర్గాలు టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం, బుధవారం జరిగిన చర్చలో అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో అసెంబ్లీలోనూ ఉద్రిక్తతకు దారి తీసింది.
అట్టుడికించిన ‘సమగ్ర సర్వే’ వివాదం
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా రాష్ర్టవ్యాప్తంగా ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనేక కష్టనష్టాలకోర్చి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల వివాదాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత నవీపేట మండలం పోతంగల్‌తోపాటు హైదరాబాద్‌లోను నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
తాను పోతంగల్‌లోనే పేరు నమోదు చేసుకున్నానని కవిత స్పష్టం చేశారు. జిల్లా అధికారులు కూడా అదే నిజమని ఆధారాలతో సహా వెల్లడించారు. అప్పట్లో నాలుగైదు రోజులు ఈ వివాదం కొనసాగి, ఆ తర్వాత సద్దుమణిగింది. తాజాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి కవిత పోతంగల్, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారని ప్రస్తావించడం, దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, కొండా సురేఖ తదితరులు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో లేని ఓ మహిళా నేతపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిరసన వ్యక్తమయింది.
రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
సమగ్ర సర్వేలో ఎంపీ కవితనే రెండు చోట్ల పేరు నమోదు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి తీరును టీడీపీ సభ్యులు సమర్థించగా, మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కవితపై వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికలలో వచ్చిన వాటిని పట్టుకొని విమర్శించడం తగదని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.