గ్యాస్‌ మంట | Cooking Gas Price Hike | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మంట

Nov 4 2017 12:45 PM | Updated on Jul 6 2019 3:18 PM

Cooking Gas Price Hike - Sakshi

మంచిర్యాల టౌన్‌: మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగింది. సామాన్యుడిపై భారం పడింది. కేంద్రం ప్రస్తుతం పెంచింది రూ.4.50 అయినా గడిచిన 16 నెలల్లో పెంచిన పెంపు మొత్తం రూ.240.50 కావడం గమనార్హం. సబ్సిడీ ఎత్తివేయాలనే యోచనతోనే కేంద్రం నెలనెలా ఇలా గ్యాస్‌ ధర పెంచుతున్నట్లు తెలుస్తోంది. 2016 జూలైలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు ఈ ధరలను 16 నెలల్లో 19 సార్లు సవరించాయి. ఇందులో ఎక్కువ సార్లు పెరుగుదలే ఉంది. వంటగ్యాస్‌ను సబ్సిడీపై పొందుతున్న వారిలో సాధారణ కుటుంబాలే అధికంగా ఉన్నాయి.  ప్రభుత్వం నేరుగా పెట్రోలియం సంస్థలకు సబ్సిడీ సొమ్మును సర్దుబాటు చేసి వినియోగదారులకు తక్కువ ధరకే గతంలో సిలిండర్‌ అందించేది. 

అయితే సబ్సిడీని పెట్రోలియం సంస్థలకు సర్దుబాటు చేయకుండా వినియోగదారుల నుంచి నిర్ణీత సొమ్ము వసూలు చేసి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే విధానం కొంతకాలంగా అమలు చేస్తోంది. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై రూ.90 నుంచి రూ.200 వరకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. అంటే గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం అంత మొత్తాన్ని భరించేది. అయితే వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి నెలా గ్యాస్‌పై రూ.4 చొప్పున ధర పెంచాలని నిర్ణయించింది. ఇలా ప్రతినెలా ధర పెంచుతూ పోయి 2018 మార్చి వరకు మొత్తం సబ్సిడీని ఎత్తివేయాల ని యోచిస్తోంది. గత నెల సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.714 ఉండగా ఈ నెల నుంచి పెరిగిన ధరతో కలిపి రూ. 808కి (ఇందులో సబ్సిడీ మినహా పెరిగింది రూ.4.50) చేరింది. 

నెలకు రూ.18.76 లక్షలకు పైనే భారం 
ఉమ్మడి జిల్లాలో 45 ప్రైవేట్‌ గ్యాస్‌ ఏజెన్సీలలో సబ్సిడీ గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య 4.17 లక్షల వరకు ఉంది. ఒక్కో సిలిండర్‌పై రూ.4.50 పెంచడంతో వినియోగదారులపై నెలకు రూ.18.76 లక్షల భారం పడనుంది. 2016 ఆగస్టులో గ్యాస్‌ రూ. 567.5 ఉండగా, ప్రతి నెలా పెరుగుతూ మధ్యలో కొంచెం తగ్గినా అక్టోబర్‌కు రూ.714కు చేరింది. ఈ నెల రూ.808 అయింది.  

గత నెల సబ్సిడీ గ్యాస్‌ ధర రూ.714 
ప్రస్తుతం పెరిగిన ధర(రూ) రూ.808 
ఈ నెల పెంపు రూ.94 (సబ్సిడీ పోనూ పెరిగిన మొత్తం రూ.4.50) 
ఉమ్మడి జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు 4.17లక్షలు 
ప్రజలపై నెలకు భారం రూ.18.76 లక్షలు 

ధరలు పెంచుకుంటూ పోతే ఎలా..? 
వంట గ్యాస్‌ ధరలను ప్రతి నెలా ఇలా పెంచుకుంటూ పోతే మాలాంటి మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి. గతేడాది రూ.560 వరకు ఉన్న గ్యాస్‌ ధర ఈ నెల రూ.808కి పెంచి మాపై భారం మోపడం సరికాదు.  
– బిరుదుల కవిత, రెడ్డికాలనీ, మంచిర్యాల

గింతగనం ఎన్నడూ పెరగలేæ.. 
కేంద్రం ఏం నిర్ణయాలు తీసుకుంటుందో ఏమోగాని గీ ప్రభుత్వాలు అధికారంలోకి  వచ్చిన తర్వాత వంట గ్యాస్‌ ధర విపరీతంగా పెరిగింది. ఏ సర్కార్‌ కూడా ఎన్నడు గింత గనం పెంచలేదు. సామాన్య ప్రజలు వంటగ్యాస్‌ పోయి మీద వండుకొని తినడం మానేసి కట్టెల పొయ్యిని నమ్ముకునేలా చేస్తున్నారు.                  

– ఎం. ఇందిర, మంచిర్యాల

గ్యాస్‌ ధరలు తగ్గించాలే... 
పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే  తగ్గించాలి. గ్యాస్‌ ధరలేమో పెంచుకుంటూ పోతే ఏ నెల ఎంత ధర ఉంటదో మాకు ఎట్లా తెలుస్తుంది. మాకు పనిచేసుకునే చోట గ్యాస్‌ ధరలు పెంచినట్లు జీతాలు పెంచి ఇవ్వడం లేదు. ఓ వైపు కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అందనంత దూరం పోయినయ్‌. నోట్ల రద్దు తర్వాత అన్ని ధరలు తగ్గుతాయాని గొప్పలు చెప్పిన నాయకులు ఇప్పుడేమో ఎవరు మాట్లాడుతలేరు.                            

– నవీన, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement