సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: ఇటీవలే అసెంబ్లీ ఎన్ని కలు నిర్వహించిన ప్రభుత్వం జనవరిలో పంచా యతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి తర్వాత ఫిబ్రవరిలో ‘సహకార’ పోరుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ఫ్యాక్స్) ఎన్నికలు నిర్వహించనుంది. గురువారం రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్త్రార్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులకు ఓటరు జాబితా ప్రక్షాళన పని ప్రారంభించారు. ఈ నెల 14న సంఘ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాల్లో మొదటి ఓటరు జాబితాను అంటించనున్నారు.
వీటిపై అభ్యంతరాలకు 21వ తేదీ వరకు గడువు విధించారు. సంఘాల్లో ఏవైనా కేసులు, సంఘంలో చేరి ఏడాది పూర్తి కానివారు, ఓటరు జాబితాలో పరిశీలించిన తర్వాత 28న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 76 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 1.20 లక్షల మంది రైతులకు సభ్యత్వం ఉంది. గత పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. 4వ తేదీ నుంచి ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీకాలన్ని ప్రభుత్వం పొడిగించింది. సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించింది. వీరు సహకార కమిషన్ కార్యాలయానికి వెళ్లి పదవీకాలన్ని పొడిగించుకున్నారు. ఆగస్టు నెలతో ఆరునెలల గడువు ముగియడంతో తిరిగి మళ్లీ ఆరు నెలలపాటు పదవీకాలన్ని పొడిగించారు.
ఫిబ్రవరితో ముగియనున్న గడువు
సహకార సంఘాల పాలకవర్గాలకు ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన గడువు వచ్చే ఫిబ్రవరి 3వ తేదీతో ముగిస్తుంది. దీంతో ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ లోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఫ్యాక్స్ ఓటర్ల జాబితాలో సమూలంగా మార్చేస్తున్నారు. ఇంతకాలం అడ్డగోలుగా సభ్యత్వం తీసుకున్న వారిని తొలిగించేందుకు చర్యలు చేపట్టారు. గతంలో రూ.10 చెల్లించి సభ్యత్వం పొందగా, ఇప్పుడు సభ్యత్వ రుసుం రూ.300కు పెంచారు. రూ.10తో సభ్యత్వం తీసుకున్న వారు సభ్యులుగా కొనసాగే అవకాశం ఉన్నా.. ఓటు వేసే హక్కు ఉండదు. దీంతో పాటు ప్రతి సభ్యుడి ఫొటో, గుర్తింపుకార్డు వివరాలను ఓటరు జాబితాలో ముద్రించారు. ఈ నెల 14వ తేదీన అన్ని సంఘాల కార్యాలయాల వద్ద ఓటరు జాబితాను అతికించనున్నారు. ఇప్పటివరకు సీఈఏ అనే వ్యవస్థ లేకపోగా, ఇప్పుడు ఓటర్ల జాబితాలను ఫొటోలతో సహకార రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో జాబితాలను వెల్లడించి వాటిపై అభ్యంతరాలను ఈ నెల 22వ తేదీ వరకు స్వీకరించి మళ్లీ మార్పులు చేస్తారు. ఈ విధానం ఫ్యాక్స్‌తో పాటు ఇతర సంఘాలకు వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకుని ఏడాది గడువులోగా తిరిగి చెల్లించని వారి పేర్లను సహకార బ్యాంకులు ఎగవేతదారుల పేర్లు జాబితాలో పెడితే వారికి ఓటు హక్కు ఉండదు.
జిల్లాల వారిగా సహకార సంఘాలు, సభ్యులు
జిల్లా సంఘాలు సభ్యులు
ఆదిలాబాద్ 28 53,391
మంచిర్యాల 20 23,056
నిర్మల్ 16 25,430
కుమురంభీం 12 18,167
మొత్తం 76 20,044
ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం..
సహకారం సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరితో ముగిస్తుంది. ఇప్పటికే రెండుమార్లు పదవీకాలం పొడిగించడం జరిగింది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓటరు జాబితా ప్రక్షాళనకు ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 28వ తేదీ వరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసి ఫిబ్రవరి 15వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– బి.సంజీవ్‌రెడ్డి, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల సహకార శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment