అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్‌ | Corona Effect Over Indian Students America Education | Sakshi
Sakshi News home page

అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్‌

Published Fri, Apr 10 2020 1:49 AM | Last Updated on Fri, Apr 10 2020 7:29 PM

Corona Effect Over Indian Students America Education - Sakshi

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) అలహాబాద్‌లో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఫైనలియర్‌ చదువుతున్న చల్ల వేణుధర్‌ జీఆర్‌ఈలో మంచి స్కోర్‌ సాధించి యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయీ (షికాగో) ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో అడ్మిషన్‌ పొందాడు. ఇప్పటికే అతనికి వీసా డాక్యుమెంట్లన్నీ అందాయి. కానీ కరోనాతో ఇప్పుడు అతని అంచనాలు తప్పాయి. అమెరికాలో చదువు కోసం వేణుధర్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా వచ్చిన మూడు ఉద్యోగాలను వదులుకున్నాడు. వాటిలో ఒకటి డెలాయెట్‌లో రూ.13.5 లక్షల వార్షిక వేతనం. 

ఐఐటీ వారణాసిలో ఫైనలియర్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న రఘు కోనేటి జీఆర్‌ఈలో మంచి స్కోరు సాధించి కోరుకున్నట్టుగానే యూని వర్సిటీ అఫ్‌ ఫ్లోరిడా (గ్యాన్‌విల్లే)లో ఫైనాన్షియల్‌ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. వీసా కోసం అన్ని పత్రాలు వర్సిటీ నుంచి వచ్చాయి. అమెరికా వెళుతున్నానన్న ఉద్దేశంతో తనకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా లభించిన ఉబెర్‌ (రూ.36 లక్షల వార్షిక వేతనం) ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 

అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆందోళన అవసరం లేదు. కచ్చితంగా వారికి తదుపరి అకడమిక్‌ సెమిస్టర్‌లలో అవకాశాలు ఇస్తారు.– యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయీ, షికాగో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రణవ్‌ బోన్సులే 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి : క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా వచ్చిన ఉద్యోగాలు వదులుకోవడాన్ని వారు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఏడాది పాటు విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నదే వేలాది మంది విద్యార్థుల ఆందోళన. ఒక్కసారి ఉద్యోగంలో చేరితే అకడమిక్‌గా ముందుకు సాగలేమనే ఉద్దేశంతోనే మెజారిటీ ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులు ఉన్నత విద్యవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నందున అక్కడ విశ్వవిద్యాలయాలు జూన్‌ చివరి దాకా తెరుచుకునే అవకాశం లేదు. తిరిగి విశ్వవిద్యాలయాలు ఎప్పుడు పని చేస్తాయన్నది చెప్పడం కష్టమేనని, ఒకవేళ ఆగస్టు నాటికి మామూలు పరిస్థితులు నెలకొన్నా ఫాల్‌–2020 తరగతులు సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం గగనమేనని యూనివర్సిటీ అఫ్‌ ఫ్లోరిడా గ్యాన్‌విల్లే అకడమిక్‌ విభాగం పేర్కొంది. (కరోనా మృతులు లక్షలోపే: ట్రంప్)

‘మీకు ఇచ్చిన అడ్మిషన్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. మీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయి మార్కుల జాబితా రాగానే మాకు పంపండి. ఫాల్‌ వీలు కాకపోతే స్ప్రింగ్‌–2021కి మీ అడ్మిషన్‌ను వాయిదా వేస్తాం’అని విద్యార్థులకు పంపిన కమ్యూనికేషన్‌లో స్పష్టం చేసింది. ‘యూనివర్సిటీ అఫ్‌ ఆరిజోనాలో (ఫాల్‌–2020) నాకు అడ్మిషన్‌ వచ్చింది. సెమిస్టర్‌ సమయం వృథా కాకుండా మామూలుగా సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తే మంచిదని నేను యూనివర్సిటీ అకడమిక్‌ విభాగానికి మెయిల్‌ పెట్టాను. ఫాల్‌కు ఆన్‌లైన్‌ పూర్తి చేస్తే స్ప్రింగ్‌ నాటికి హాజరు కావచ్చన్నది నా అభిప్రాయం. కానీ, అమెరికా నిబంధనల ప్రకారం ఒప్పుకోకపోవచ్చు’అని శ్రీనికేత్‌ శ్రీవాస్తన్‌ పేర్కొన్నారు. 
 
40 వేల మందికి అడ్మిషన్లు.. 
ఇప్పటికే ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన లేదా నాలుగో ఏడాదిలో ఉన్న విద్యార్థులు దాదాపు 40 వేల మంది ఫాల్‌–2020కి అడ్మిషన్లు పొందారు. షెడ్యూల్‌ ప్రకారం మరో 30 నుంచి 40 వేల మందికి ఈ నెలాఖరుకు అడ్మిషన్లు రావాలి. కానీ, అక్కడ 90 శాతం విశ్వవిద్యాలయాలు కరోనా వైరస్‌ కారణంగా పని చేయడం లేదు. ఈ వర్సిటీలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో, అడ్మిషన్లు ఎప్పుడు ఇస్తారో అనే దానిపై స్పష్టత లేదు. ‘జూన్‌ నాటికి మామూలు పరిస్థితులు నెలకొని జూలైలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినా వారు ఫాల్‌ –2020కి హాజరు కావడం గగనం. ఒకసారి విద్యార్థి ఐ20 అందుకున్న తరువాత వీసా అపాయింట్‌మెంట్‌కు ఆరు వారాలు పడుతుంది. ప్రస్తుత తరుణంలో అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మంది మే మొదటి వారంలోగా వీసా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఉండాల్సింది. కాన్సులేట్లు మూసి ఉన్న కారణంగా అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల ఫాల్‌–2020 అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగదు’అని పాతికేళ్లుగా అమెరికా విశ్వవిద్యాలయాలకు కన్సల్టెంట్‌గా పని చేస్తున్న కొర్లపాటి నాగభూషణ్‌రావు చెప్పారు. (కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్)
 

మే 15 దాకా కాన్సులేట్‌లు తెరుచుకోవడం అనుమానమే.. 
కరోనా కారణంగా మూతపడ్డ అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయాలు మే 15 దాకా తెరుచుకోవడం అనుమానమే. ‘కచ్చితంగా ఫలానా సమయంలో పని చేస్తాయని చెప్పలేం. కానీ, మాకు అందుతున్న సమాచారం ప్రకారం మే 15 దాకా పని చేయవు’అని కాన్సులేట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మందికి జూలై, ఆగస్టులో గానీ అపాయింట్‌మెంట్లు పొందే అవకాశం లేదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఒకసారి కాన్సులేట్‌ పని చేయడం మొదలుపెడితే ఏప్రిల్‌ 15 నాటికి వీసా అపాయింట్‌మెంట్‌ కలిగి ఉన్న వారికే (ప్రస్తుతం రద్దయ్యాయి) జూన్‌ చివరి దాకా రీషెడ్యూల్‌ అవుతాయి. అందువల్ల కొత్త అపాయింట్‌మెంట్లకు అవకాశం ఉండకపోవచ్చని ఆ వర్గాలు వివరించాయి. (తైవాన్ విషం చిమ్ముతోంది: చైనా)
 
స్ప్రింగ్‌కు వాయిదా పడతాయి.. 
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల ఈ ఏడాది ఫాల్‌–2020 అకడమిక్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన అడ్మిషన్లు రద్దు కావు. స్ప్రింగ్‌ లేదా ఫాల్‌ 2021కి వాయిదా పడతాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్, షికాగో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రణవ్‌ బోన్సులే అన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆందోళన అవసరం లేదని, కచ్చితంగా వారికి తదుపరి అకడమిక్‌ సెమిస్టర్‌లలో అవకాశాలు ఇస్తారని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు.  (అమెరికాలో భారతీయుల అవస్థలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement