సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచినందున చాలామంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అవసరమున్న ప్రతి వ్యక్తికి పరీక్షలు చేస్తామని, అందుకోసం 11 కేంద్రాల్లో అనుమానితుల నమూనాలు సేకరిస్తున్నామన్నారు. పరీక్షల కోసం వస్తున్న వారు తప్పక మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లేదంటే అవే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. మంగళవారం మంత్రి తన చాంబర్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారు తక్కువ లక్షణాలుంటే ఇంట్లోనే ఐసోలేషన్ కావాలని మంత్రి సూచించారు. ఇలా ఉన్నవారికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్ సెంటర్ నుండి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు.
అవసరం ఉన్న వారి దగ్గరకు డాక్టర్లను పంపించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు వచ్చిన ప్రతి పేషంట్ దగ్గరికి డాక్టర్, నర్స్ తప్పకుండా రోజుకి మూడుసార్లు వెళ్లి పరీక్ష చేయాలని, పేషంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలను కరోనా పేషంట్లను చేర్చుకునేందుకు సిద్ధంచేయాలంటూ, ఆ బాధ్యతను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్‌కు అప్పగించారు. వాటి సన్నద్ధతపై రోజూ రిపోర్ట్ అందజేయాలని మంత్రి కోరారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), గాంధీ ఆస్పత్రుల్లో ఎంతమంది సిబ్బంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు రూ పొందించాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జనరల్ ఆస్పత్రి వరకు అన్నింటా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఆ మేరకు క్షేత్రస్థాయిలోని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నందున డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివా‹స్‌ను ఆదేశించారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత వేగంగా వైరస్ వ్యాప్తినీ అడ్డుకోవచ్చన్నారు.
కరోనా నమూనాల సేకరణ తిరిగి ప్రారంభం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మం గళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సామర్థ్యానికి మించి శాంపిల్స్ స్వీకరించడంతో గత వారం పరీక్షలు పెం డింగ్‌లో పడ్డాయి. దీంతో పరీక్షలకు విరామం ప్రకటించిన యంత్రాంగం... తిరిగి మంగళవారం పరీక్షల కోసం శాంపిల్స్ స్వీకరణను ప్రారంభించింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 11 కేంద్రాల్లో నమూనాలు సేకరిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. తీవ్రతను బట్టి ఆస్పత్రికి తరలించడమో లేదా హోం ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. శాంపిల్స్ సేకరణ కేంద్రాల వద్ద నిబంధనలను కఠినతరం చేశారు. అనుమానితులు తప్పకుండా మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటిస్తేనే నమూనాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment