సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా కోవిడ్ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని, అందుకు అవసరమైన పరికరాలు, కిట్లను పంపుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు మరో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశ వివరాలన్నింటినీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి మీడియాకు వివరించారు. గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు అదనంగా ఉస్మానియాలో ఏర్పాటు చేయబోయే కోవిడ్ నిర్ధారణ కేంద్రం పనిజేస్తుందన్నారు. అలాగే హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ కోవిడ్ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి అనుమతి కోరామన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తా జాగా పరీక్షలు నిర్వహించామని, నెగటివ్ వచ్చిందన్నారు. మరోమారు పరీక్ష చేసి, నాలుగైదు రోజుల్లో అతన్ని డిశ్చార్జి చేస్తామన్నారు. అంటే ఈ క్షణానికి తెలంగాణలో ఒక్క మనిషికి కూడా కోవిడ్ వైరస్ లేదని మంత్రి సగర్వంగా ప్రకటించారు. విమానాశ్రయంలో 24 గంటలూ స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు.
రెండు స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాల కొనుగోలు
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామ ని ఈటల తెలిపారు. అయితే అందుకు కేంద్రం సహకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు థర్మల్ స్క్రీనింగ్స్ యంత్రాలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మం త్రి హర్షవర్ధ్దన్‌తో మంగళవారం మాట్లాడానన్నారు. అన్ని విమానాశ్రయాల్లోనూ కోవిడ్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అందుకు అంగీకరించారన్నారు. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన దగ్గర ఒకవేళ కోవిడ్ కేసులు వస్తే ఏం చేయాలన్నదానిపై తదుపరి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 41,102 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశామని, 277 మందికి అనుమానిత లక్షణాలున్న కారణంతో పరీక్షలు చేయగా, వారందరికీ నెగిటివ్ వచ్చిందని మంత్రి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ సూచన...
చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, థాయిలాండ్, సింగపూర్, మలేసియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చే ప్రయాణికులంతా స్వతహాగా 14 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
కోవిడ్ కట్టడికి సాయం చేస్తాం
కోవిడ్ వైరస్ కట్టడిలో సర్కార్‌కు సాయం అందించేందుకు యశోద ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చింది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను యశోద ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్ కలసి కోవిడ్ వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థ తరఫున అందించే సాయంపై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.20 లక్షల మాస్క్‌లు అందించామని, మరో 80 వేలు బుధవారంలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే 60 వెంటిలేషన్‌తో కూడిన ఐసోలేషన్ పడకలను అందుబాటులో ఉంచుతామన్నారు. వాటిని కేవలం కోవిడ్ వైరస్ చికిత్స కోసం వచ్చే వారికి మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. సిక్రింద్రాబాద్, మలక్‌పేట, సోమాజిగూడలలో 20 చొప్పున బెడ్లను ఏర్పాటు చేశామని యశోద ఆసుపత్రి ఎండీ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment