సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభణ సిటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజుల క్రితం దీని ఉద్ధృతి కాస్త తగ్గినట్లే కన్పించినా.. కొత్తగా వెలుగు చూస్తున్న కేసులు బెంబేలెత్తిస్తున్నాయి.
నగరంలో గత మార్చి నెల 2న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు 287 పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఆ తర్వాత కేవలం వారం రోజుల్లోనే 199 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్స్, విధిగా మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లతో చేతులను శుభ్రపర్చుకోవడం వంటి పద్ధతుల ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చని అధికార యంత్రాంగం భావించింది. ఆ మేరకు మార్చి 22 నుంచి మే 7 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం విదితమే. కేసుల సంఖ్యను బట్టి గ్రేటర్‌ను కంటైన్మెంట్ జోన్లుగా విభజించి ప్రజల రాకపోకలను కట్టడి చేస్తోంది. అయినా రోజురోజుకూ మరింత పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిలోనూ ఆ తర్వాత వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుండటం గమనార్హం. వైరస్ వ్యాప్తి రెండో దశను దాటి మూడో దశలోకి వెళ్లిందని చెప్పడానికి ప్రస్తుతం రిపోర్ట్ అవుతున్న కేసులే నిదర్శనమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాతబస్తీలోనే అత్యధికం
గ్రేటర్‌లో గత నెల 2 నుంచి ఈ నెల 19 వరకు 486పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటికే వైద్య చికిత్సలతో 131 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 16 మంది మృతి చెందారు. వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం.. కేసుల నియంత్రణ కోసం గ్రేటర్‌ను 152 కంటైన్మెంట్ జోన్లుగా విభజించింది. వీటిలో చార్మినార్ సర్కిల్ పరిధిలో 50 జోన్లు ఉండగా, ఒక్క చార్మినార్‌లోనే 175పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ మూలాలు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. తలాబ్‌కట్టకు చెందిన మృతురాలి ద్వారానే 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మలక్‌పేటకు చెందిన మరో మహిళ ద్వారా 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఇలా కేవలం నాలుగు కుటుంబాల్లోనే వందకుపైగా కేసులు వెలుగు చూశాయి. వైరస్ సోకిన వారిలో కేవలం కుటుంబ సభ్యులే కాకుండా చికిత్స చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, స్టాఫ్ నర్సులు కూడా ఉన్నారు.
ఖైరతాబాద్‌లో 88 పాజిటివ్..
పాతబస్తీ తర్వాత ఖైరతాబాద్ క్లస్టర్ పరిధిలోనే ఎక్కువగా వెలుగు చూశాయి. ఇక్కడ 52 కంటైన్మెంట్ జోన్లుఉండగా, ఇప్పటి వరకు 88 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కేసులు ఎక్కువ నమోదు కావడానికి ఆసిఫ్‌నగర్, ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, నాంపల్లి, ఖైరతాబాద్‌లలోని వ్యక్తుల కుటుంబ సభ్యుల్లోనే అత్యధిక కేసులు వెలుగు చూడటమే ఇందుకు కారణం. ఆ తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ ఉంది. ఇక్కడ 20 జోన్లు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శేరిలింగంపల్లిలో 14 కంటైన్మెంట్ జోన్లుఉండగా, ఇప్పటి వరకు 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కూకట్‌పల్లిలో 13 జోన్లు ఉండగా, 21 కేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్‌లో అత్యల్పంగా మూడు జోన్లు ఉండగా, ఇక్కడ ఇప్పటి వరకు మూడు కేసులే నమోదు కావడం గమనార్హం.
ఈ నెల 19 వరకు కంటైన్మెంట్ జోన్లు..
శేరిలింగంపల్లి
పాజిటివ్ కేసులు
కంటైన్మెంట్ జోన్లు : 14
పాజిటివ్ కేసులు : 31
కూకట్‌పల్లి
కంటైన్మెంట్ జోన్లు : 13
పాజిటివ్ కేసులు : 21
ఖైరతాబాద్
కంటైన్మెంట్ జోన్లు : 52
పాజిటివ్ కేసులు : 88
చార్మినార్
కంటైన్మెంట్ జోన్లు : 50
పాజిటివ్ కేసులు : 175
ఎల్బీనగర్
కంటైన్మెంట్ జోన్లు : 03
పాజిటివ్ కేసులు : 04
సికింద్రాబాద్
కంటైన్మెంట్ జోన్లు : 20
పాజిటివ్ కేసులు : 40
Comments
Please login to add a commentAdd a comment