సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం పరిస్థితి బాగోలేదు. ఆయా జిల్లాల్లో అధికంగా కేసులుండటానికి గల కారణాలను, విస్తరించడానికి దోహదపడిన పరిస్థితులను వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి.
ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాలతో పోలిస్తే, ఈ 4 జిల్లాల్లోనే మూడో వంతు వరకు నమోదయ్యాయి. ప్రధానంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారానే కేసులు నమోదైన విషయం తెలి సిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆరుగురి ద్వారా ఏకంగా 81 మందికి కరోనా అంటుకుంది. ఒక్క చార్మినార్ ప్రాంతంలోనే 143 మందికి కరోనా వైరస్ సోకిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. 30 సర్కిళ్లలో డీఎంహెచ్‌వో ప్రత్యేకాధికారులను నియమించారు. కంటైన్మెంట్ జోన్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. చదవండి: తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు
ప్రతి ఇంటికీ వెళ్లి వయసువారీగా ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులుంటే, వారి వివరాలు సేకరించి వారికున్న అనారోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. అనుమానం వస్తే పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర స్థానిక నేతల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగైతేనే స్థానిక ప్రజలు మాట వింటారనేది సర్కారు ఆలోచన. దీనిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి పెద్దలు పలువురు నేతలతో చర్చించారు.
ఇతర జిల్లాలపైనా ఫోకస్..
వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలపైనా ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించారు. ముఖ్యంగా సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. అక్కడి యంత్రాంగానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. మర్కజ్ కాంటాక్టు వ్యక్తులను వేగంగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిఘా పెంచాలని కోరింది. అనుమానితులు ఉంటే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు వెళ్లాయి. సూర్యాపేట జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
10 మంది మర్కజ్‌కు వెళ్లిరాగా, అందులో ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు కన్పించాయి. వారిలో ఒకరు సూర్యాపేట పట్టణానికి చెందినవారు. మరొకరు ఆ జిల్లాలో ఓ మండలానికి చెందిన వ్యక్తి. సూర్యాపేటకు చెందిన వ్యక్తి ద్వారానే 38 మందికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగించింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్టు ద్వారా మార్కెట్ బజార్‌లోని ఓ కిరాణా వ్యాపారికి కరోనా వచ్చింది. ఈ వ్యాపారి నుంచి అతడి కుమార్తెకు, మార్కెట్‌లో చేపలు, కూరగాయలు, పొగాకు అమ్మే వ్యాపారులకు.. వారి నుంచి కుటుంబ సభ్యులకు ఇలా 38 మందికి వైరస్ సోకింది.
కరీంగనగర్ ఆదర్శంగా..
కరోనా కట్టడిలో కరీంనగర్ మార్గదర్శిగా నిలిచింది. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కృషి, పోలీస్, వైద్య, ఆరోగ్య, మున్సిపల్ సిబ్బంది సేవలు, ప్రజల క్రమశిక్షణతో కరోనాను కట్టడి చేశారు. మొదట కరీంనగర్‌కు వచ్చిన 10 మంది ఇండోనేసియన్లకు మార్చి 16న కరోనా లక్షణాలు కనిపించాయి. 17న ఒకరికి పాజిటివ్‌గా తేలింది. 18 నాటికి ఆ సంఖ్య 8కి చేరింది. అప్పటినుంచే కరీంనగర్‌లో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇండోనేసియన్లు బస చేసిన ప్రాంతాలు, పర్యటించిన ఏరియాలను రెడ్‌జోన్లుగా గుర్తించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేశారు. ఇండోనేసియన్లు 10 మంది, వారి ద్వారా నలుగురికి వ్యాధి సోకినా కఠిన ఆంక్షలతో వైరస్ చైన్ తెగిపోయి ఇతరులకు సోకలేదు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19 మందిలో కశ్మీర్‌గడ్డ ప్రాంతంలోని ఒక యువకుడికి, హుజురాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. హుజురాబాద్‌లో పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి సోదరుడికి తర్వాత వ్యాప్తి చెందింది.
కరీంనగర్ స్ఫూర్తితో వైరస్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు నివసించిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు (హాట్‌స్పాట్‌లు)గా ప్రకటించి, ఇతర ప్రాంతాలతో సంబంధాలను తెంచుతున్నారు. గత నెల 22న జనతా కర్ఫ్యూకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ పిలుపునివ్వడానికి ముందే అంటే.. 19 నుంచే ఈ ప్రాంతాలతో పాటు కరీంనగర్‌లోని ప్రధాన రోడ్లలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. 23 నుంచి లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఇండోనేసియన్లు పర్యటించిన ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ఆ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు నిత్యావసర వస్తువులను , కూరగాయలను కార్పొరేషన్ ద్వారానే అందించే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నారు. వరంగల్ అర్బన్‌లోనూ అలాగే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. అయితే అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లోనూ కరీంనగర్ మోడల్‌గా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా వ్యవహరించి క్రమశిక్షణతో కంటైన్మెంట్ ప్రాంతాల్లో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. చదవండి: లాక్‌డౌన్ సడలిస్తే కష్టమే..!
Comments
Please login to add a commentAdd a comment