రూ. 50కే మూడు కిలోల కోడి | Coronavirus Effects on Chicken Prices in Nizamabad | Sakshi
Sakshi News home page

భలే మంచి చౌక బేరం!

Published Fri, Mar 13 2020 8:17 AM | Last Updated on Fri, Mar 13 2020 8:17 AM

Coronavirus Effects on Chicken Prices in Nizamabad - Sakshi

నిజామాబాద్‌,బాన్సువాడ: చికెన్‌ అమ్మకాలపై కరోనా ప్రభావం పడడంతో పౌల్టీ పరిశ్రమ కుదేలవుతోంది. చికెన్‌ అమ్మకాలు పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు బహిరంగ మార్కెట్‌లో చికెన్‌ అమ్మకాలు చేస్తున్నారు. గురువారం ఓ పౌల్ట్రీఫాం యజమాని బాన్సువాడలోని వారాంతపు సంతలో రూ. 50కే 2 నుంచి 3 కిలోల కోడిని విక్రయించారు. స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఎల్లారెడ్డి మండలం బాణాపూర్‌ నుంచి పౌల్ట్రీ యజమాని శేఖర్‌ కోళ్లను తీసుకువచ్చి విక్రయించాడు. కేవలం 50 రూపాయలకే ఒక కోడి ఇవ్వడంతో వందలాది మంది వచ్చి కోళ్లను తీసుకెళ్లారు. బాన్సువాడ వారాంతపు సంతకు బీర్కూర్, నస్రుల్లాబాద్, నిజాంసాగర్, గాంధారి మండలాల నుంచి ప్రజలు వస్తారు. కోళ్లను తక్కువ రేటుకే విక్రయించడంతో ప్రజలు పోటీపడి కొనుగోలు చేయడం గమనార్హం.

బెంబేలెత్తుతున్న వ్యాపారులు
కరోనా ప్రభావం ఉమ్మడి జిల్లాలోని కోళ్ల పరిశ్రమ రైతులకు, చికెన్‌ సెంటర్ల వ్యాపారులపై తీవ్రంగా పడుతోంది. చికెన్‌ తినడం వల్ల కరోనా వైరస్‌ సోకుతుందనే పుకారుతో కొనుగోలుదారులు భయపడుతున్నారు. ప్రభుత్వం చికెన్‌ తినడం వల్ల కరోనా రాదని అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. పుకార్ల వల్ల చికెన్‌ అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉపాధి కోసం పౌల్ట్రీ ఫాంలను ఏర్పాటు చేసుకొని కోళ్ల పెంపకం చేస్తున్న యజమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మార్కెట్‌లో చికెన్‌ ధర రోజురోజుకు పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు నష్టాన్ని చవిచూస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో మార్కెట్‌లో చికెన్‌ అమ్మకాలు 70శాతం పడిపోయాయి. నెలరోజుల క్రితం చికెన్‌ కిలోకు రూ. 160 ఉండగా, ప్రస్తుతం రూ. వందకు పడిపోయింది. వేసవితాపం పెరిగే కొద్ది కోళ్లకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుందనే అనుమానంతో చికెన్‌ జోలికి వెళ్లేందుకు సాహసించడం లేదు. దీంతో వ్యాపారులు అతితక్కువ ధరకు కోళ్లను విక్రయిస్తున్నారు.

అంబేడ్కర్‌ చౌరస్తాలో..
ఒక్కో కోడికి రోజుకు రూ. 5 ఖర్చు చేయాలి
ఎల్లారెడ్డి మండలం బాణాపూర్‌లో నాకు పౌల్ట్రీ ఫాం ఉంది. ఈ ఫారంలో 10 వేల కోళ్లు ఉన్నాయి. ఒక్కొక్క కోడికి ప్రతిరోజూ రూ. 5 చొప్పున వెచ్చించి ఆహారం అందిస్తాం. చికెన్‌ అమ్మకాలు పడిపోవడంతో వ్యాపారులు తీసుకెళ్లడం లేదు. అందుకే నేనే కోళ్లను సంతలోకి తీసుకెళ్లి విక్రయించుకుంటున్నాను. భారీగా నష్టం జరుగుతున్నా, కోళ్లకు దాణా పెట్టడానికి కూడా డబ్బులు లేక, అప్పుల పాలై విక్రయించాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర అప్పుల పాలవుతాను. ప్రజలకు విక్రయిస్తే వారైనా తింటారు. నష్టమైనా కోళ్లను విక్రయించుకుంటున్నాను.– శేఖర్, పౌల్ట్రీ ఫారం యజమాని

కరోనా గిరోనా జాన్తా నై  
చికెన్‌తో కరోనా వస్తుందనేది అపోహ మాత్రమే. ఎన్ని కో ళ్లు తిన్నా కరోనా రాదు. అపోహల వల్ల చికెన్‌ ధరలు పడి పోయాయి. పౌల్ట్రీ ఫాం య జమానులు కోళ్లు బహిరంగంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నేనైతే రెగ్యులర్‌గా చికెన్‌ తింటా. ఎలాంటి వ్యాధులు రావు. ఇప్పుడు మార్కెట్‌లో 3 కోళ్లను కొనుగోలు చేశాను.   – మహ్‌ఫూజ్, కొనుగోలుదారుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement