ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా కరోనా ప్రభావం తగ్గదు. మారుతున్నవాతావరణ పరిస్థితులకనుగుణంగా వైరస్ రూపాంతరం చెంది మరింత బలపడే అవకాశాలున్నాయి. కోవిడ్‌కు.. ఉష్ణోగ్రతలకు అసలు సంబంధమే లేదు. మ్యూటేటెడ్ వైరస్ అయిన కరోనా ఎలాంటి కాలంలోనైనా తట్టుకుని బతికే అవకాశాలున్నాయని కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ పోరిక శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎండలు తీవ్రమైన కొద్దీ వైరస్ తన శక్తిని కోల్పోతుందనే భావనతగదని, రానున్న కొద్దిరోజులు ప్రజలు మరింత అప్రమత్తంగాఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మరో రెండువారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపే శ్రీరామరక్షణ అని, తెలంగాణలో వైరస్ థర్డ్‌స్టేజీకి చేరలేదన్నారు. లోకల్ ట్రాన్స్‌మిషన్ చైన్‌లింక్‌ను విజయవంతంగా విడగొట్టామన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..
గాంధీ ఆస్పత్రి: కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు అటాప్సీ చేస్తే వైరస్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ అనుమతితోపాటు నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాలి. అటాప్సీతో కరోనా వైరస్ మానవ శరీరంలో ఏయే అవయవాలపై ఎంత ప్రభావం చూపించింది, మృతికి నిర్దిష్టమైన కారణం, వైరస్ బలం, బలహీనతలను అంచనా వేసే అవకాశం ఉంటుంది. గాంధీ ఆస్పత్రి మార్చురీలో కరోనా మృతదేహాలను హైపోక్లోరైడ్, లైజాల్ వంటి ప్రత్యేకమైన ద్రావణాలతో శుభ్రపరిచి, ఇతరులకు వైరస్ వ్యాపించకుండా జిప్‌బ్యాగ్‌లో సీల్ చేసి కుటుంబసభ్యులకు అందిస్తున్నాం.
గాంధీలో మూడు సేప్టీ టన్నెల్స్
కోవిడ్ బాధితులు, అనుమానితులతో పాటు సుమారు 1500 మంది వైద్యసిబ్బంది, మరో 200 మంది పోలీసులు గాంధీ ఆస్పత్రికి రాకపోకలు సాగిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా మూడు సేప్టీ టన్నెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.
ఉపశమనానికి ప్రత్యేక ప్రణాళికలు
గాంధీ వైద్యులు, సిబ్బంది, ఇతర అ«ధికారులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్నారు. దీని నుంచి వారికి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాం. వైద్యులు, సిబ్బందిని మూడు గ్రూపులుగా విభజించాం. ఒక గ్రూప్‌కు రెస్ట్ ఇచ్చి మిగిలిన వారు విధులు నిర్వర్తిస్తారు. సెక్రియాట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిరంతరం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వైఫై, ల్యాప్‌టాప్, ఫోన్ వంటి సౌకర్యాలు కల్పించాం. గాంధీలో వైద్యులు, అధికారులతో 16 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం. ఆయా కమిటీలు ఫర్‌ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయి.
అవసరమైతేనే క్లోరోక్విన్ మాత్రలు
పాజిటివ్ పేషెంట్‌తోపాటు క్లోజ్ కాంట్రాక్టులో ఉన్నవారికి, బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నవారికే క్లోరోక్విన్ మాత్రలు ఇస్తున్నాం. మాత్రలు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు తదితర రుగ్మతలు ఉన్నవారు వైద్యసలహా మేరకే ఈ మాత్రలు వాడాలని సూచిస్తున్నాం. వైద్యులు, సిబ్బంది చాలామంది ఈ మాత్రలను వినియోగిస్తున్నారు. గాంధీ వైద్యులు, సిబ్బందికి కరోనాపై అధ్యయన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటి వరకు గాంధీ వైద్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఓన్లీ పాజిటివ్ కేసులైతే బెటర్
కోవిడ్ ఆస్పత్రిగా గుర్తించిన గాధీఆస్పత్రిలో కేవలం కరోనా పాజిటివ్ కేసులే అడ్మిట్ చేస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుంది. బాధితులు, అనుమానితులకు వేర్వేరుగా వైద్యసేవలు అందించడం కొంత తలనొప్పి వ్యవహారమే. అనుమానితులకు ఇతర ప్రాంతాల్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి, పాజిటివ్ వచ్చిన రోగులనే గాంధీకి రిఫర్ చేస్తే బాగుంటుంది. గచ్చిబౌలి నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే గాంధీలో ఉన్న అనుమానితులకు అక్కడికి తరలించే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రి ఎప్పటికీ కోవిడ్ ఆస్పత్రిగా ఉండదు. మరో నాలుగు నెలల తర్వాత గతంలో మాదిరిగానే అన్ని విభాగాల ద్వారా వైద్యసేవలు అందిస్తాం. ప్రస్తుతం గాంధీ వైరాలజీ విభాగంలో గాంధీ ఆస్పత్రికి నేరుగా వచ్చే అనుమానితులకు మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
రెండునెలల్లో కరోనా రహిత తెలంగాణ
మరో రెండు నెలల్లో కరోనా రహిత తెలంగాణ ఆవిషృతమవుతుంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాజిటివ్ బా«ధితులకు నయం చేసేందుకు నెలరోజులు పడుతుంది. లాక్‌డౌన్ కొనసాగించి, ప్రజలు చైతన్యవంతులై సహకరిస్తే రెండు నెలల్లో కరోనా వైరస్ లేని తెలంగాణను చూడవచ్చు.
హంటాతో తంటా..
కరోనా పురిటిగడ్డ చైనాలోనే మరో కొంత వైరస్ హంటా వెలుగుచూసింది.ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్సేనని వైద్యనిపుణులు భావిస్తున్నారు. హంటా వైరస్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాం.
Comments
Please login to add a commentAdd a comment