మణుగూరులో కార్మికుడి ఇంటివద్ద పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా మహమ్మారి జిల్లాలో విస్తరిస్తుండడం కలకలం రేకెత్తిస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలకూ ఈ వైరస్ పాకింది. వరుసగా నాలుగు రోజుల నుంచి బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరులో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్చిలో జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాను రెడ్ జోన్ జాబితాలో పెట్టింది. వారంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాక తిరిగి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో తిరిగి గ్రీన్‌జోన్ జాబితాలో చేర్చారు. లాక్‌డౌన్ సమయంలో కోవిడ్ విజృంభించకుండా జిల్లా అధికారులు చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకోవడం గమనార్హం. మళ్లీ ఈనెల 5న కొత్తగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న కొత్తగూడేనికి చెందిన యువతి ఈనెల 4న ఇక్కడికి వచ్చింది. అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సదరు యువతికి కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో డిశ్చార్జ్ అయింది.
తాజాగా నాలుగు కేసులు..
జిల్లా సేఫ్ జోన్‌లో ఉందనుకుంటున్న సమయంలో వరుసగా నాలుగు ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. ఏపీలోని కూనవరానికి చెంది¯న ఓ బంగారం వ్యాపారి ఈనెల 19న బూర్గంపాడుకు వచ్చాడు. అక్కడ పలువురిని కలవడంతో పాటు పాల్వంచ, భద్రాచలంలోనూ మరికొందరిని కలిశాడు. అదేరోజు తిరిగి కూనవరం వెళ్లగా 20వ తేదీన అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అదే రోజున పాల్వంచ కేటీపీఎస్‌లో ఏఈగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా సదరు ఉద్యోగికి జ్వరం వస్తుండడంతో పాల్వంచలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కరోనా ఉన్నట్లు తేలింది. 21న కొత్తగూడెంలో సింగరేణి ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా సోమవారం మణుగూరు ఏరియా సింగరేణిలో పనిచేస్తున్న మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ నలుగురు వ్యక్తులు కలిసిన వారందరినీ గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీరి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. అయితే 20, 21, 22 తేదీల్లో వరుసగా పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగులుగా చేస్తున్న వారికి కరోనా పాజిటివ్ రావడంతో సహచర ఉద్యోగుల్లోనూ టెన్షన్ నెలకొంది.
మణుగూరులో కలకలం
మణుగూరురూరల్: మణుగూరులో కరోనా కలకలం మొదలైంది. ఓ సింగరేణి కార్మికుడికి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పి.వి.కాలనీలో స్పెషల్ డీ 1121 నంబర్ క్వార్టర్‌లో నివాసం ఉంటూ పీకేఓసీ–2లో ఈపీ ఫిట్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కార్మికుడికి ఇటీవల కిడ్నీ నొప్పి వచ్చింది. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స అందించిన వైద్యులు, ఈ నెల 16న కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈనెల 18న హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. వారు కిడ్నీతో పాటు కరోనా పరీక్షలు కూడా నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది..
సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియగానే మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రి క్వారంటైన్ ఇన్‌చార్జ్ నరేష్‌కుమార్, డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది అతడి నివాస ప్రాంతాన్ని పరిశీలించి, బ్లీచింగ్ చల్లించారు. ఇటీవల ఎవరెవరిని కలిశాడు, ఏరియా ఆస్పత్రిలో అతడిని పరీక్షించిన వైద్య సిబ్బంది ఎవరనే వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో అతడితో కాంటాక్టు అయిన ఆరుగురి శాంపిల్స్ సేకరిస్తామని, కార్మికుడు విధులు నిర్వహించే ఓసీ–2లో అతడికి సన్నిహితంగా ఉండే మరో నలుగురికి కూడా వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లేముందు అతడు పాల్వంచలోని అత్తవారింటికి వెళ్లాడని, కొత్తగూడెంలోనూ తిరిగాడని, అతడు కలిసిన వారందరి వివరాలు తెలుసుకుని వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. కాగా, మణుగూరు ఏరియాలో కార్మికుడికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ రావడంతో ఇతర కార్మికుల్లో కలవరం మొదలైంది. తాము ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే పని చేస్తున్నామని ఏరియా ఆస్పత్రి వైద్యులు భయాందోలన చెందుతున్నారు.
కంటైన్మెంట్ జోన్‌గా రామవరం
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఆదివారం సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్ రావడంతో రామవరం సెంటర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఆక్కడి వాణిజ్య సంస్థలను టూటౌన్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మూసి వేయించారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు çసీతాలక్ష్మి సోమవారం రామవరం సెంటర్‌ను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment