సాక్షి, హైదరాబాద్ : కర్ఫ్యూ నిబంధనల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి మినహాయింపునిచ్చింది. ఫలితంగా రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయాల్లో కూడా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇది వెంటనే అమల్లోకి రానుంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచన మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే దీనిపై సాధారణ పరిపాలన విభాగం నుంచి ఉత్తర్వు వెలువడింది. (ఈ నెలా జీతాల కోత! )
లాక్‌డౌన్ తర్వాత ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోసిటీ బస్సులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే.. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటున్న నేపథ్యంలో, ఆ సమయాల్లో మాత్రం బస్సులు తిరగరాదని, కర్ఫ్యూ వేళలకు పూర్వమే గమ్యం చేరుకోవాలని అప్పట్లో సీఎం చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇటు బస్సులు ప్రారంభమైనా.. కరోనా భయంతో జనం వాటిల్లో ప్రయాణించేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో ఆర్టీసీకి టికెట్ రూపంలో ఆదాయం బాగా పడిపోయింది. బస్సులు తిరిగి ప్రారంభమయ్యాక తొలి రోజు కేవలం రూ.65 లక్షల ఆదాయం మాత్రమే రాగా, ఆ తర్వాత మూడ్రోజులకు అది రూ.2 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం సగటున నిత్యం రూ.2 కోట్లు మాత్రమే సమకూరుతోంది. ('దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి')
లాక్‌డౌన్‌కు పూర్వం ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.12 కోట్లుగా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్‌లో అది రూ.15 కోట్లుగా ఉంటుంది. అంతా ఆదాయమున్నా.. సంస్థను సరిగా నడపలేని పరిస్థితి ఉండగా ఇప్పుడు కేవలం రూ.2 కోట్లకు ఆదాయం పడిపోవటంతో సంస్థ తీవ్రంగా కలవరపడుతోంది. చాలామంది రాత్రి వేళ ప్రయాణానికి మొగ్గు చూపుతారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఆ అవకాశం లేకపోవటంతో అలాంటి వారు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జనం పగటి వేళ బస్సెక్కేందుకు జంకుతున్నారు. ఈ విషయాలను మంత్రి పువ్వాడ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళ ప్రయాణాలకు అనుమతినిస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సీఎం సమ్మతించారు.
ఇమ్లీబన్‌లోకి బస్సులు..
ప్రస్తుతం జిల్లా బస్సులు హైదరాబాద్‌లోకి రావటం లేదు. సిటీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నగరంలోకి వాటి రాక సరికాదని అప్పట్లో నిర్ణయించారు. కరీంనగర్ రూట్ నుంచి వచ్చే బస్సులు మాత్రం జూబ్లీ బస్‌స్టేషన్‌లోకి వస్తున్నాయి. మిగతా మార్గాల్లో వచ్చేవి నగరం వెలుపలే నిలిపేస్తున్నారు. తాజాగా అన్ని బస్సులు సిటీలోకి వచ్చేందుకు అనుమతించారు. ఇమ్లీబన్ వరకు అన్ని బస్సులు వస్తాయి. కర్ఫ్యూ వేళ బస్సు దిగి ఇళ్లకు వెళ్లేవారు టికెట్ చూపితే పోలీసులు అనుమతిస్తారు. వారి కోసం ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు కూడా కర్ఫ్యూ వేళ బస్టాండ్ల నుంచి తిరిగేందుకు కూడా పచ్చజెండా ఊపారు.
కొత్త మార్పులు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. సిటీలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సులకు మాత్రం అనుమతినివ్వలేదు. నిజానికి గురువారం నుంచే కొన్ని మార్గాల్లో సిటీ సర్వీసులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్ధంగా ఉండాల్సిందిగా డీఎంలకు సూచించారు. సీఎం అనుమతి రాగానే ప్రారంభించాలనుకున్నారు. కానీ, కేసుల తీవ్రత దృష్ట్యా మరో పది, పదిహేను రోజులు వేచి చూడాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇటు అంతర్‌రాష్ట్ర సర్వీసులకు కూడా అనుమతి నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment