
సాక్షి, చాంద్రాయణగుట్ట : ఇరాన్ నుంచి ఎనిమిది మంది మతప్రచారకులు హైదరాబాద్‌లోని నల్లగుట్టకు వచ్చారనే సమాచారంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 18 నుంచి నలుగురు పురుషులు నల్లగుట్ట మసీదులోనే బస చేస్తుండగా నలుగురు మహిళలు మసీదు కమిటీకి చెందిన ఓ సభ్యుడి ఇంట్లో బస చేస్తున్నారు. అయితే ప్రాథమిక పరీక్షల్లో వారికి కరోనా లక్షణాల్లేవని తేలడంతో వారిని ఈ నెల 29 వరకు క్వారంటైన్ చేశారు. అయినా స్థానికుల్లో అనుమానం వెంటాడుతోంది. ఇరాన్ నుంచి 8 మంది గత నెల 24న ఢిల్లీకి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి 29న హైదరాబాద్‌కు రైలులో వచ్చారు. మల్లేపల్లిలోని బడా మసీదులో అప్పటి నుంచి బస చేస్తూ ఉన్నారు.
గురువారం రాత్రి ఈ విషయం తెలియడంతో రాంగోపాల్‌పేట పోలీసులు మసీదు కమిటీ ప్రతినిధులను సంప్రదించారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా, కరోనా లక్షణాలు లేవని అంగీకరించలేదు. శుక్రవారం ఉదయం వైద్య బృందం వచ్చి వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడంతో ఎలాంటి లక్షణాలు కన్పించలేదు. ఈ నెల 29న వారు తిరిగి ఢిల్లీ వెళ్లి.. వచ్చే నెల 4న ఇరాన్ వెళ్తుండటంతో అప్పటివరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. మరోవైపు కిర్గిస్తాన్ నుంచి ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన 11 మందితోపాటు యూపీకి చెందిన మరో ఇద్దరు గైడ్‌లు రెండు రోజుల నుంచి రియాసత్‌నగర్‌లోని ఓ ప్రార్థనామందిరంలోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకుని అధికారులు వారిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment