
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. మొదట కేరళలో రెండు కేసులు.. తర్వాత తెలంగాణ, ఢిల్లీలో ఒక్కో కేసు నమోదైతేనే దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాంటిది ఇప్పు డు ఏకంగా 12 రాష్ట్రాల్లోకి కోవిడ్ పాకింది. మొత్తం 60 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. దక్షిణాదిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కోవిడ్ వ్యాప్తి ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నా, పరిస్థితి మాత్రం భయాందోళనగానే ఉంది. దక్షిణాదిలో మొన్నటివరకు కేరళ, తెలంగాణలోనే కేసులు నమోదు కాగా, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలోనూ వెలుగు చూడటం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. తమిళనాడులో ఒకటి, కర్ణాటకలో ఒకేసారి నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సమీప రాష్ట్రాల్లో కేసుల నమోదు మనపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసు ఉన్న వ్యక్తికి పూర్తిగా నయం కావడం, అతడితో సంబంధం ఉన్న 88 మందికి కూడా నెగటివ్ రావడం ఊరట కలిగించే అంశమే. అయితే పక్క రాష్ట్రాల్లో విజృంభణ మన అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలో ఏకంగా 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో మనకు నిరంతరం రాకపోకలుంటాయి. అక్కడి పాజిటివ్ కేసులు విస్తరించకుండా చర్యలు మనమూ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బస్సులు, రైళ్లల్లో ప్రయాణం..
ప్రజల్లో కోవిడ్‌పై అవగాహన, భయం ఏర్పడింది. అయితే వ్యాప్తి చెందకుండా చేయగలిగేది జాగ్రత్తలే. దేశంలో ప్రస్తుతం విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల ద్వారా బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 10.57 లక్షల మందికి థర్మల్ స్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అందులో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 50,679 మందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో అనుమానితులను గాంధీ సహా ఇతర ప్రభుత్వ నిర్ధారిత ఆస్పత్రుల్లో ఐసోలేషన్ చేసి, పరీక్షలు నిర్వహించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి మన రాష్ట్రానికి అనేకమంది రైళ్లు, బస్సుల ద్వారా వస్తుంటారు. విమానాశ్రయాల్లో మాదిరిగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఎలాంటి థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లు కానీ, ఇతరత్రా ఏర్పాట్లు కానీ లేవు. ముఖ్యంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులను, చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇలా వచ్చే వారిపై నిఘా పెట్టే పరిస్థితి లేదు. ఓ అంచనా ప్రకారం బెంగళూరు నుంచి ప్రభుత్వ ప్రైవేటు బస్సులు 200 వరకు రోజూ నడుస్తాయి. చెన్నై నుంచి రైళ్లల్లో ఎక్కువగా వస్తుంటారు.
ఇంత నిర్లక్ష్యమా?
కోవిడ్ వైరస్ అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి చేరింది. ఇలా బస్సులు, రైళ్లల్లో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా, పర్యవేక్షణ లేదు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించగా, అలాంటి ఏర్పాట్లు లేవని, ప్రజలు అవగాహనతో మసలుకోవాలని పేర్కొనడం గమనార్హం. వాస్తవంగా మన రాష్ట్రంలో నమోదైన కోవిడ్ పాజిటివ్ బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులోనే వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంత జరిగినా బస్టాండ్లపై నిఘా పెట్టడంపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయంలో 50 వేల మందిని స్క్రీనింగ్ చేసినా, మన రాష్ట్రంలో నమోదైన కేసు బస్సు ద్వారానే వచ్చిందన్నది వాస్తవం. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదన్న చర్చ జరుగుతోంది. పదేపదే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించినా, ఎంత ఖర్చయినా సిద్ధమని సర్కారు ప్రకటించినా.. బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టడంలో వైఫల్యం ఉందన్న చర్చ జరుగుతోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కోవిడ్ వైరస్ కట్టడిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
సమన్వయ లోపం..
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కొందరు అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ రూంను కోఠిలో ఏర్పాటు చేసినా, కొందరు అధికారులు అక్కడకు రావట్లేదన్న చర్చ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ రూం అక్కడ 24 గంటలూ పనిచేస్తోందని, ఎలాంటి సమాచారమైనా అక్కడ దొరుకుతుందని చెబుతున్నా ఆచరణలో అలా కన్పించట్లేదు. ఐదారు కమిటీలు వేసినా రోజు వారీగా సమీక్షించడంలో వైఫల్యం అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా మంత్రి ఈటల నిర్వహించే సమీక్షలకు కొందరు సీనియర్ అధికారులు డుమ్మా కొట్టడంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. ఎప్పుడో ఒకసారి వచ్చి పోతున్నారని చెబుతున్నారు. ఎంతో కీలకమైన కోవిడ్ వైరస్ కంటే ఆయా అధికారులకు ఇంకేం పని ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి ప్రొటోకాల్ ప్రకారం మంత్రి పక్కన ఉండాల్సిన అధికారులు, ఆయన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడ ఉన్నాయి. దీనిపై మంత్రి ఈటల కూడా కాస్త అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment