సాక్షి, ఖమ్మం : హైదరాబాద్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ (సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య సిబ్బందికి కరోనా రావడంతో 24గంటల పాటు విధులు నిర్వహించే పోలీస్ శాఖలో కరోనా టెన్షన్ మొదలైంది. నిత్యం అన్ని ప్రాంతాల్లో డ్యూటీ చేసే వారిని..ఈ పరిస్థితిలో మరింత జాగరుకతతో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దారుడి వెంట గుంపులుగా ప్రజలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది అంతా మాస్క్ ధరించాలని, తరచూ చేతులను శానిటైజ్ చేసుకుంటుండాలని, విధులు నిర్వర్తించేప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే అంతటా పకడ్బందీగా ఆచరిస్తున్నారు.
50 ఏళ్ల వారిపై దృష్టి
పోలీస్ శాఖలోని వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో 50 నుంచి 55ఏళ్ల వయస్సు ఉన్న వారిపై ఉన్నతాధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండాలని ఇప్పటికే అవగాహన కల్పించారు. కరోనా వైరస్ బారిన పడి తర్వాత ఆస్పత్రుల్లో ఇబ్బంది పడొద్దని వీరికి బయట విధులను తగించేస్తున్నారు.
సీపీ కార్యాలయంలో కట్టుదిట్టం
ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న సీపీ కార్యాలయంలో కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యాలయంలో ప్రవేశించే సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. చేతులకు శానిటేజర్ పూస్తున్నారు. వారు సామాన్య ప్రజలైనా, పోలీస్ అధికారులైనా, వీఐపీలు అయినా..ఈ నిబంధనలు కచ్చితం చేశారు. గతంలో సీపీని, అడిషనల్ డీసీపీలను కలిసేందుకు వచ్చే వారు కార్యాలయంలోని హాల్‌లో కూర్చునేవారు. కరోనా దృష్ట్యా ఇప్పుడు కార్యాలయం ఆవరణలోనే ప్రత్యేకంగా టెంట్ వేసి వారు కూడా భౌతికదూరం పాటించేలా కూర్చోబెడుతున్నారు.
కొన్ని నెలలుగా బయటకు రాని శిక్షణ కానిస్టేబుళ్లు
లాక్‌డౌన్ కాలం అయిన మార్చి చివరి నుంచి లాక్‌డౌన్ ఎత్తేశాఖ ఇన్ని రోజులుగా ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రం బయటకు వెళ్లడం లేదు. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఖమ్మంలోని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాటి రాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. వారికోసం కుటుంబ సభ్యులను సైతం రావద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment