రిమ్స్ ఆస్పత్రి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి లో అత్యాధునిక సేవలు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్‌స్థాయిలో వైద్యం అందించేందుకు నూతన పరికరాలు మంజూరయ్యాయి. రిమ్స్ ప్రారంభం నుంచి సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. త్వరలో ఇది కూడా అందు బాటులోకి రానుంది. ఆస్పత్రిలో సదుపాయలు, వైద్యసేవల మెరుగు కోసం కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమం లో త్వరలో ఆస్పత్రికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం అందుబాటులో లేని అత్యాధునిక పరికరాలు రానున్నాయి. ఇటీవలే రిమ్స్‌లో డయాలసీస్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఉద్యోగుల హెల్త్‌కార్డులకు ఈ సేవలు వర్తించలేదు. వారం క్రితం ఉద్యోగులకు సైతం ఈ సేవలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు డయాలసీస్ కేంద్రంలో 500 మందికి రక్తశుద్ధి చేశారు. అలాగే రూ.కోటి వ్యయంతో ఆస్పత్రిలో లిక్విడ్ కల్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా టీబీకి సంబంధించిన స్పుటం పరీక్షలు చేస్తారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆస్పత్రుల నుంచి నమూనాలు రిమ్స్‌కు తీసుకురానున్నారు. ఇలా పలురకాల అత్యాధునిక సేవలు రిమ్స్‌లో ప్రారంభం కానున్నాయి.
శరవేగంగా సెంట్రల్ ఆక్సిజన్‌ప్లాంట్..
ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆవరణలో ఇప్పటికే ప్లాంట్ మిషన్ ఏర్పాటు చేశారు. మెడికల్ ఐసీయూ, పిడియాట్రిక్, ఆపరేషన్ థియేటర్, ఐసీసీయూ, ఎమర్జెన్సీవార్డుల నుంచి పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు. పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జంబోసిలిండర్ ద్వారా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే వార్డులో రోగులకు పైపులైన్ ద్వారా ఆక్సిజన్ అందించవచ్చు.
కలెక్టర్ ఫండ్స్ నుంచి రిమ్స్‌కు నిధులు..
రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. ఇప్పటికే ప్రతీవారం ఆస్పత్రి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న కలెక్టర్ రిమ్స్‌లో అవసరమైన సదుపా యాల కోసం కలెక్టర్ ఫండ్స్ నుంచి నిధులు వెచ్చిస్తున్నారు. ఇందులో భాగంగానే రూ.7.5 లక్షలతో అంబులెన్స్ మంజూరు చేశారు. దీంతో పాటు రూ.15లక్షలతో ఈఎంటీ పరికరాలు కొనుగోలుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. జేసీ ఆధ్వర్యంలో ఈ టెండర్లు జరుగనున్నాయి. వీటితో పాటు రిమ్స్‌లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రా>నున్నాయి. ఇటీవల చిన్నపిల్లలకు శస్త్రచికిత్స సేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రూ. 1.60 కోట్లతో అప్తాలమిక్ విభాగంలో రేజర్స్, మైక్రోస్కోప్, టోనోమిటర్స్, తదితర పరికరాల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి.
రోగులకు మెరుగైన వైద్యసేవలు..
రిమ్స్‌కు వచ్చే రోగులకు ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. త్వరలో మరిన్ని అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్, సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్, లిక్విడ్ కల్చర్ ల్యాబ్, ఈఎంటీ, అప్తాలమిక్ విభాగాల్లో నూతన పరికరాలు మంజూరయ్యాయి. సెంట్రల్ ఆక్సిజన్‌ప్లాంట్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. కలెక్టర్ నిధుల నుంచి సైతం అంబులెన్స్ మంజూరైంది. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు, సేవలు ఇక్కడే అందుతాయి. అలాగే వైద్య విద్యార్థుల కోసం రూ. 6లక్షలతో డిజిటల్ లైబ్రెరీ ప్రారంభించనున్నాం. ఇందుకు సంబంధించి 12 కంప్యూటర్లు కొనుగోలు చేశాం.
– కె.అశోక్, రిమ్స్ డైరెక్టర్
గంటకు 400 పరీక్షలు..
రిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగానికి రూ.40 లక్షల విలువ చేసే ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్ ఇప్పటికే చేరుకుంది. త్వరలో ఈ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ పరికరానికి గంటకు 400 పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. 50 రకాల రక్త పరీక్షలను దీని ద్వారా చేస్తారు. ప్రస్తుతం ఆయా రక్త పరీక్షల రిపోర్టు రావాలంటే రోజంతా సమయం పడుతుంది. రోగులు పరీక్షల రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సి ఉండేది. ఈ మిషన్ ద్వారా ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సైతం ఒకే రోజు అన్ని పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లే వీలు ఉంటుంది. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ పరికరం ఉంది. ఇప్పటికే ఇద్దరు టెక్నీషియన్‌లకు శిక్షణ సైతం ఇచ్చారు. కేవలం రక్త నమూనాలు సేకరించి మిషన్‌లో పెడితే చాలు మిగతా పనులన్నీ పరికరమే చూసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment