వనపర్తి ఆస్పత్రిలో ప్రసవ వేదన
‘ నేను ఎంతో ఉదారంగా.. సేవా ధృక్పథంతో ఆపరేషన్లు చేద్దామని ముందుకొచ్చాను. కానీ, ఇక్కడ ఎవరూ సహకరించడం లేదు. అటెండర్ నుంచి నర్సు వరకు ఇదే పరిస్థితి. ఆపరేషన్లు చేయించుకునే వారున్నా.. చేసేందుకు తాను ముందుకు వచ్చినా.. సహకార లోపం వెంటాడుతోంది. బాలింతలకు ఇవ్వాల్సిన పారితోషికం, రక్తం, మందుల బిల్లుల చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ఇక్కడ వృత్తి నిబద్ధత లోపించిందని గ్రహించాను. అందుకే పనిచేయలేక పోతున్నా..’ ఇది ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు ఆవేదన. ఒక వైద్యాధికారే తనకు సహకరించడం లేదని చెబుతున్నారంటే ఈ ఆస్పత్రిలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది.
వనపర్తి టౌన్ : ప్రభుత్వ ఆసుప్పత్రులోనే ప్రసవాలు, శస్త్రచికిత్సలు చేయించుకోవాలని సర్కార్ సైతం ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వనపర్తిలో ఏర్పాటు చేసిన వంద పకడల ఏరియా ఆస్పత్రికి వనపర్తి నియోజకవర్గంతో పాటు కొల్లాపూర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి ప్రసవాలు చేయించుకునేందుకు మహిళలు వస్తుంటారు. కానీ, ఇక్కడ ఆపరేషన్లు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆస్పత్రి ప్రారంభం నుంచి గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేయకపోవడంతో ఏడాదికి ఎప్పుడో ఒక్కమారు డిప్యూటేషన్‌పై వచ్చే డాక్టరే దిక్కుగా మారింది. ఐదు నెలల కిందట ఆపరేషన్‌లు, కాన్పులు చేసేందుకు నిర్ణయించారు. ఆ మేరకు కొంత విజయవంతమయ్యారు. కానీ, ఇప్పుడు వైద్యాధికారులు ఆ ఊసే పట్టించుకోవడం లేదు. దీంతో ఏరియా ఆస్పత్రిలో ప్రసవాలు, ఆపరేషన్లు జరిగినట్టే జరిగి ఒక్కసారిగా బ్రేక్ పడడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం పీజీ విద్యార్థిని (8నెలల ట్రైనింగ్‌లో ఉన్న వైద్యురాలు) ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే, ఆమె ఆపరేషన్లు చేయడానికి వెనుకాడుతోంది. దీంతో ఆస్పత్రి పరిస్థితిని అర్ధం చేసుకున్న వనపర్తి క్లస్టర్ అధికారి శ్రీనివాసులు ఇక్కడ ప్రసవాలు, ఆపరేషన్లు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొంతకాలం పాటు శ్రీనివాసులు, ట్రైనింగ్‌లో ఉన్న వైద్యురాలు స్వాతి ఇద్దరు కలిసి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ తరుణంలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి, బాలింతలకు ఇచ్చే పారితోషికం, మందుల బిల్లుల చెల్లింపు విషయంలో ఆస్పత్రి సూపరింటెండ్, ఎస్పీహెచ్‌ఓకు మధ్య విభేధాలు పొడచూపినట్టు ప్రచారం సాగింది. ఇదే సమయంలో ఎస్పీహెచ్‌ఓ కూడా ఆపరేషన్లు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడ కాన్పుకోసం వచ్చిన మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. వైద్యసేవలు అందినట్టే అంది.. మళ్లీ దూరం కావడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్‌లు జరిగేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
ఎస్పీహెచ్‌ఓకు ఎప్పటికీ వెల్‌కం
వనపర్తి ఏరియా ఆస్పత్రిలో కాన్పులు, ఆపరేషన్‌లు చేసేందుకు ఎస్పీహెచ్‌ఓ ముందుకు రావడం మాకు.. ప్రజలకు ధై ర్యాన్ని చ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల.. పీహెచ్‌సీల పర్యవేక్షణ మూలంగా ఎస్పీహెచ్‌ఓ శ్రీనివాసులు ఆస్పత్రికి రావడం లేదనుకుంటున్నాం. ప్రజలకు మంచి జరగడానికి తనకు బేషజాలు లేవు. ఎస్పీహెచ్‌ఓ ఎప్పుడొచ్చినా ఆయనకు వెల్‌కం చెబుతాం.
- భాస్కర్‌ప్రభాత్,
సూపరింటెండెంట్, వనపర్తి.