భూత్పూర్ : పంటరుణాల పేర రైతుల నుంచి అక్రమవసూళ్లకు పాల్పడుతూ ఓ బ్యాంకు అధికారి కోట్లకు పడగలెత్తాడు. భూత్పూర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేసిన ఓ అధికారి అన్నదాతలకు పంటరుణాలు మంజూరుచేస్తూ వారి నుంచి కమీషన్ పేర అక్రమంగా వసూలుచేశాడు. బాధితరైతులు కొందరు ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయడంతో అసలు బాగోతం వెలుగుచూసింది. దీంతోఆయనను ఇక్కడినుంచి బదిలీచేసిన ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. కొన్నిరోజుల క్రితం ఏపీజీవీబీ విజిలెన్స్ విభాగం బృందం కొత్తమొల్గర, పాతమొల్గర, కప్పెట తదితరగ్రామాల్లో రైతుల నుంచి వివరాలు సేకరించింది.
మధ్యవర్తులు చెబితినే పంటరుణం
బ్యాంకులో గతంలో పనిచే సిన సంబంధిత అధికారి ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున మధ్యవర్తులను నియమించుకుని వసూళ్ల పర్వం సాగించాడు. ఈ బ్రాంచ్ పరిధిలోని కొత్తమొల్గర, పాతమొల్గర, కర్వెన, కొత్తూరు, తాటిపర్తి గ్రామాల ప్రజలకు బ్యాంకుసేవలు అందిస్తోంది. కొత్తమొల్గరకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు బాధిత రైతులు పేర్కొంటున్నారు. రైతులు కొత్తరుణాలు పొందడానికి, రుణాల రెన్యూవల్ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్తే వాయిదావేస్తూ తిప్పుకునేవారు.
పక్షంరోజుల తరువాత మేనేజర్ సూచనలతో మధ్యవర్తులు రంగప్రవేశం చేసి రైతులతో ఒప్పందం కుదుర్చుకునేవారు. మధ్యవర్తులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే మేనేజర్ రుణాలు మంజూరుచేసేవారు. రైతులు ఖాతానుంచి డబ్బులు తీసుకున్న వెంటనే మధ్యవర్తులు వారినుంచి 10 నుంచి 15శాతం వరకు కమీషన్ వసూలుచేసేవారు.
ఈ బ్రాంచ్ పరిధిలో ఆరు గ్రామాలకు సంబంధించి వ్యవసాయపంట రుణాలకు చెందిన రెండువేల రైతుల ఖాతాలు ఉన్నాయి. స్కేల్ ఆఫ్‌ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా రుణమొత్తాన్ని అమాంతం పెంచేసి రైతుల నుంచి నేరుగా 15శాతం వరకు డబ్బులు తీసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి.
వ్యవసాయ టర్మ్‌లోన్స్, డెయిరీ, పౌల్ట్రీ, వాణిజ్య రుణాలు, హౌసింగ్ రుణాలు వంటి వాటిని మంజూరు చేయాలంటే చేయి తడపాల్సిందేనని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తమొల్గర గ్రామస్తులు చేసిన ఫిర్యాదుతో స్పందించిన ఏపీజీవీబీ ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే బ్రాంచ్ కార్యాలయంలో అంతర్గత విచారణ చేపట్టింది. సదరు అధికారిని వరంగల్ జిల్లాకు సాధారణ బదిలీచేశారు. అతడిపై వేటు వేయకుండా సంబంధితశాఖ ఉన్నతాధికారులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విచారణ కొనసాగుతోంది..
రైతులకు పంటరుణాలు మంజూరు చేసేందుకు మధ్యవర్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గతంలో ఇక్కడ పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ రత్నాకర్‌పై భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గరకు చెందిన కొందరు రైతులు ఫిర్యాదుచేయగా.. ఉన్నతాధికారులకు నివేదించాం. ఇప్పటికే బ్రాంచ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాం. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
- రాజు, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్
రూ.3వేలు ఇచ్చాం..
నాకు రెండేకరాల పొలం ఉంది. పంటరుణం కోసం భూత్పూర్‌లోని గ్రామీణ బ్యాంకుకు వెళ్తే 15రోజులు తిరిగినా లోను మంజూరుచేయలేదు. మేనేజర్‌ను అడిగితే ఇంకా టైం పడుతుందని చెప్పాడు. చివరకు కొత్తమొల్గరకు చెందిన ఓ వ్యక్తితో మాట్లాడుకోమన్నాడు. ఆయనతో మాట్లాడిన రోజే రుణం మంజూరుచేసిండు. తీసుకుని బయటికి వచ్చిన వెంటనే నా వద్ద నుంచి రూ.3వేలు తీసుకున్నాడు.
- ఎర్రకాశన్న, రైతు, పాత మొల్గర, భూత్పూర్ మండలం
అవినీతి దందా
Published Mon, Sep 14 2015 12:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement